Museum In Home At Punjab : తన ఇంట్లోనే ఒక మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు ఓ రిటైర్డ్ ప్రొఫెసర్. ఈ మ్యూజియంలో దేశ విదేశాలకు చెందిన పాత వస్తువులు ఉన్నాయి. చిత్రలేఖనంపై మక్కువ ఉన్న ఈ రిటైర్డ్ ప్రొఫెసర్ పెయింటింగ్స్‌తో పాటు పురాతన వస్తువులు, పాత కరెన్సీని కూడా మ్యూజియంలో పెట్టారు. ఆయనే పంజాబ్‌లోని బఠిండా జిల్లాకు చెందిన హర్దర్శన్ సింగ్ సోహల్. ఆయన నెలకొల్పిన మ్యూజియమే హవేలీ ఉమ్రాన్.
ఈ మ్యూజియం బఠిండా జిల్లాలోని జై సింగ్ వాలా గ్రామంలో ఉంది. చిన్నప్పటి నుంచి సేకరించిన వాటితో మ్యూజియం నిర్మించారు సోహల్. తను ఇప్పటివరకు గీసిన బొమ్మలను కూడా మ్యూజియంలో పెట్టినట్లు హర్దర్శన్ సింగ్ సోహల్ తెలిపారు.
"చిన్నప్పటి నుంచి నాకు పురాతన వస్తువులపై ఆసక్తి ఉండేది. నేను మొదట్లో పెయింటింగ్స్ వేసేవాడిని. ఈ మ్యూజియంలో ఉన్న పెయింటింగ్స్ మొత్తం నేను వేసినవే. ఆ తర్వాత కొద్ది రోజులకు నాకు ఈ పురాతన కాలం నాటి వస్తువులపై ఆసక్తి కలిగింది. ఏదైనా ఒక వస్తువు పాతం కాలంలోనిది లాగా కనిపిస్తే చాలు దాని తీసుకొచ్చి మ్యూజియంలో పెడతాను. దీనిపై చాలా ఖర్చు చేశాను. కానీ ఇలా సేకరించటం నాకు చాలా మంచిగా అనిపిస్తుంది "
-హర్దర్శన్ సింగ్ సోహల్, మ్యూజియం యజమాని
ఈ మ్యూజియంలో పురాతన వస్తువులతో పాటు కరెన్సీ నోట్లు, కాయిన్స్, ఆయుధాలు, వ్యవసాయ పనిముట్లు, పంజాబీ దుస్తులు, కెమెరాలు ఉన్నాయి. బ్రిటిష్ కాలం నాటి వస్తువులు కూడా ఉన్నాయి. అయితే వీటిని దేశవిదేశాల నుంచి తీసుకొచ్చి మ్యూజియంలో పెట్టినట్లు సోహల్ చెబుతున్నారు. అయితే వాటిలో కొన్నింటిని కొనుగోలు చేయగా మరికొన్ని వస్తువులను ప్రజలు ఉచితంగా ఇచ్చినట్లు చెబుతున్నారు హర్దర్శన్ సింగ్ సోహల్.