Theatre Canteen Owner Bites Pushpa 2 Viewer Ear :ప్రముఖ టాలీవుడ్ కథానాయకుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 దేశవ్యాప్తంగా మంచి ప్రజాదరణ సొంతం చేసుకుంది. తాజాగా రూ.1000 కోట్లు వసూళ్లు సాధించింది. అయితే, ఈ సినిమా- ఓ థియేటర్ క్యాంటీన్ యజమాని, ప్రేక్షకుడి మధ్య చిచ్చు పెట్టింది!. చివరకు ఆ ఘర్షణ థియేటర్ యజమాని- ప్రేక్షకుడి చెవి కొరికే వరకు వెళ్లింది. అసలు వారిద్దరి మధ్య ఘర్షణ ఎందుకు తలెత్తిందంటే?
ఇదీ జరిగింది
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, షబ్బీర్ అనే వ్యక్తి పుష్ప-2 సినిమా చూసేందుకు మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని ఇంద్రగంజ్ ప్రాంతంలో ఉన్న కైలాశ్ టాకీస్‌కి వెళ్లాడు. సినిమా ఇంటర్వెల్ బ్రేక్‌లో తినుబండారాలు కొనేందుకు థియేటర్లోనే ఉన్న క్యాంటీన్‌కు వెళ్లాడు. అయితే ఈ క్రమంలో తినుబండారాల బిల్లు విషయంలో షబ్బీర్, క్యాంటీన్ యజమాని రాజు మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్త తీవ్ర ఘర్షణకు దారితీసింది. రాజు తన సహచరులతో కలిసి షబ్బీర్‌పై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో క్యాంటీన్ ఓనర్ రాజు- షబ్బీర్ చెవిని కొరికేశాడని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.