Mother Sacrificed Daughter :ఝార్ఖండ్లో మానవత్వానికే మచ్చతెచ్చే ఘటన జరిగింది. ఓ తల్లి తన ఏడాదిన్నర కుమార్తెను నరబలి ఇచ్చింది. ఈ కేసులో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అసలేం జరిగిందంటే?
పలాము జిల్లాకు చెందిన అరుణ్ రామ్, గీతాదేవి దంపతులు జప్లా- ఛతర్ పుర్ ప్రధాన రహదారికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఖరద్ గ్రామంలో నివసిస్తున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సంతోషంగా సాగిపోతున్న ఈ కుటుంబంలో బుధవారం(నవంబర్ 13) విషాదం నెలకొంది. గీతాదేవి అత్త కౌసల్యా దేవి నవంబర్ 12వ తేదీ ఉదయం 11 గంటలకు ధాన్యం నిల్వ చేసే ప్రదేశాన్ని శుభ్రం చేయడానికి వెళ్లింది. తనతోపాటు గీతాదేవిని రమ్మని కోరింది. అప్పుడు గీతాదేవి తన చిన్న కుమార్తెతో కలిసి జాప్లా (హుస్సేనాబాద్) వెళ్తానని చెప్పింది. అయితే అర్ధరాత్రి అయినా గీతాదేవి ఇంటికి రాకపోవడం వల్ల కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. గీతాదేవి, చిన్నారి కోసం వెతుకులాట ప్రారంభించారు. కానీ వారి ఆచూకీ లభించలేదు.
సన్నిహితుల ఇంటికి వెళ్లిన గీతాదేవి
గురువారం వేకువజామున 2 గంటల సమయంలో గీతాదేవి- అదే గ్రామానికి చెందిన మనోజ్ రామ్ ఇంటి తలుపు తట్టింది. తలుపు తీయగానే నేరుగా అతడి ఇంట్లోని పెరట్లోకి వెళ్లింది. తన భర్తతో గొడవపడి గీతాదేవి తమ ఇంటికి వచ్చిందని మనోజ్ రామ్ కుటుంబ సభ్యులు భావించారు. ఈ క్రమంలో గీతాదేవి కుటుంబీకులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో గీతాదేవిని ఆమె కుటుంబీకులు ఇంటికి తీసుకెళ్లారు.
అయితే తన మనవరాలి గురించి గీతాదేవిని ఆమె అత్త అడిగారు. జప్లాలో ఉందని గీతాదేవి సమాధానం చెప్పింది. అనుమానం వచ్చి గీతాదేవిని ప్రశ్నించినా ఆమె నిజం చెప్పలేదు. దీంతో గ్రామస్థులు హుస్సేనాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గ్రామానికి 3కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహాన్ని కనుగొన్నారు. చిన్నారి శరీరం ఛిద్రమైన స్థితిలో ఉంది. ఛాతిపై పెద్ద కత్తిగాట్లు ఉన్నాయి. అలాగే సమీపంలో కాలిపోయిన బట్టలు, గాజులు, కుంకుమ కనిపించాయి. ఈ క్రమంలో పోలీసులు గీతాదేవిని తమదైన శైలిలో విచారించగా, అసలు నిజం బయటపడింది. తాను తాంత్రిక విద్యను అభ్యసించినట్లు గీతాదేవి తెలిపింది. ఈ క్రమంలోనే తన కుమార్తెను హత్యచేశానని, తర్వాతి రోజే మళ్లీ తన మంత్ర శక్తులతో కాపాడేదానినని చెప్పుకొచ్చింది.
'నా భార్య మానసిక రోగి కాదు'
ఘటన జరిగిన రోజు గీతాదేవి భర్త అరుణ రామ్ ఇంట్లో లేడు. ఛత్ పండగకు వచ్చిన సోదరిని అత్తవారింటి వద్ద దిగబెట్టేందుకు వెళ్లాడు. తన కుమార్తెను భార్యే చంపేసిందన్న విషయాన్ని తెలుసుకుని తట్టుకోలేకపోయాడు. తన భార్య పూర్తిగా ఆరోగ్యంగా ఉందని, ఆమెకు మానసిక సమస్యలేవీ లేవని తెలిపాడు. గీతాదేవి ఎందుకిలా చేసిందో తెలియట్లేదని అన్నాడు. తాను వేరే రాష్ట్రంలో పనిచేస్తున్నానని, ఛత్ పండుగ సందర్భంగా ఇంటికి వచ్చానని చెప్పాడు. అలాగే తమకు పెళ్లైన మూడేళ్లవరకు సంతానం కలగలేదని, అప్పుడు ఓ తాంత్రికుడి వద్దకు వెళ్లిన తర్వాత మొదటి బిడ్డ పుట్టాడని చెప్పుకొచ్చాడు.
"బిహార్‌లోని రోహ్‌తాస్ జిల్లాకు చెందిన రోహిత్ అనే తాంత్రికుడు నిత్యం గ్రామానికి వస్తుంటాడు. అరుణ్ రామ్ ఇంటికి కూడా తరచుగా వెళ్లేవాడు. పొలాల వద్ద కాపలాగా ఉన్న ఓ వ్యక్తి- గురువారం అర్ధరాత్రి చిన్నపిల్లాడి ఏడుపు శబ్దం వినిపించిందని చెప్పాడు. అయితే భయంతో ఆయన అక్కడికి వెళ్లలేదు. గీతాదేవి ఒక్కతే అర్ధరాత్రి సమయంలో అడవిలోని నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లలేదు. ఆమెతో పాటు రోహిత్ అనే తాంత్రికుడు కూడా ఉన్నాడని సమాచారం అందింది. చిన్నారి మృతదేహాన్ని చూస్తే ఆమె ఛాతిని కోసి లివర్ బయటకు తీసినట్లు అర్థమవుతోంది." అని సామాజిక కార్యకర్త మన్ దీప్ రామ్ చెప్పాడు.
ప్రజలకు మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు హుస్సేనాబాద్ మహిళా శిశు సంరక్షణ స్టేషన్ ఇన్ చార్జ్ పార్వతి కుమారి తెలిపారు. దంగ్వార్, బడేపుర్, దుల్హర్, టికార్ పర్, సరస్వతి శిశు మందిర్, మిడిల్ స్కూల్లోని మైదానాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై హుస్సేనాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ ఐఆర్ నమోదైంది. గీతాదేవిని జైలుకు పంపారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు.