Mother And Son Tenth Exam :చదవాలన్న పట్టుదల ఉంటే వయసు ఏమాత్రం అడ్డు కాదని నిరూపించింది కర్ణాటకకు చెందిన ఓ మహిళ. కొన్ని కారణాల వల్ల పదో తరగతి పూర్తి చేయలేకపోయిన ఆమె, ఇటీవల కుమారుడితో కలిసి పదో తరగతి పరీక్షలు రాసి పాసైంది. కుమారుడు కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణుడవ్వడం వల్ల ఆమె కుటుంబంలో సంబరాలు మిన్నంటాయి.
హసన్ జిల్లా ఆలూరు తాలూకాలోని చిన్నల్లి గ్రామానికి చెందిన భువనేశ్ భార్య టీఆర్ జ్యోతి(38) ఇటీవల జరిగిన ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షలకు హాజరైంది. ఆమె కుమారుడు నితిన్, వివేకా కాన్వెంట్లో చదువుకున్నాడు. అతడు కూడా పరీక్షలకు హాజరయ్యాడు. అయితే మే9వ తేదీన 10వ తరగతి ఫలితాలను కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసింది. అందులో జ్యోతితోపాటు నితిన్ కూడా పాసయ్యాడు. జ్యోతి 250 మార్కులతో, నితిన్ 582 మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.
625/625 మార్కులు
మరోవైపు, బాగల్‌కోట్ జిల్లాకు చెందిన అంకిత కొసప్ప ఎస్‌ఎస్‌ఎల్‌సీ పరీక్షల ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లోనూ నూటికి నూరుశాతం మార్కులతో అదరగొట్టింది. ముధోల్ తాలుకాలో ఉన్న మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న బాలిక, ఇంజినీరింగ్ పూర్తి చేశాక ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని చెబుతోంది. ఆమె సాధించిన అపూర్వ విజయం గురించి టీచర్లు చెప్పగానే స్వగ్రామం వజ్జరమట్టిలో ప్రజలంతా ఇంటికి చేరుకొని బాలికను అభినందించారు. గ్రామస్థులు సంబరాలు చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు.