Monsoon Prediction 2024 IMD :దేశంలో ఈఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. దీర్ఘకాల సగటు LPAతో పోలిస్తే వచ్చే రుతుపవనాల సీజన్‌లో 106 శాతం వర్షపాతం నమోదు కావచ్చని తెలిపింది. వచ్చే సీజన్‌లో LPA 87 సెంటీమీటర్లగా అంచనా వేసింది. లానినా పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా ఉండడం వల్ల ఆగస్టు- సెప్టెంబరు నాటికి ఎక్కువ వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది.
'భారత్లో 9 సార్లు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం!'
వాయవ్య, తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. 1951 నుంచి 2023 వరకు ఎల్ నినో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్లో 9 సార్లు సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని ఐఎండీ తెలిపింది.
మంచి వర్షాలు కురుస్తాయ్!
జూన్ నాటికి ఎల్‌నినో బలహీనపడనుందని భారత వాతావరణ శాఖ చీఫ్ మృత్యుంజయ్ మహపాత్ర వెల్లడించారు. మే నెల నాటికి ఎల్‌నినో మరింత బలహీనపడి, జూన్ నాటికి పూర్తిగా తగ్గి తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. జులై నెలాఖరు నాటికి లానినా పరిస్థితులు ఏర్పడనున్నందున మంచి వర్షాలు కురుస్తాయని ఆయన తెలిపారు. ఇండియన్ ఓషన్ డైపోల్ పరిస్థితులు, ఉత్తరార్ధగోళంలో తగ్గిన మంచు విస్తృతి వల్ల ఈసారి నైరుతి రుతుపవనాలకు అనుకూలంగా ఉన్నాయని వెల్లడించారు.