PM Modi Wayanad Visit : కొండచరియలు జారిపడి భారీ విధ్వంసానికి గురైన కేరళలోని వయనాడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. ఏరియల్ సర్వే నిర్వహించి విలయం తీవ్రతను తెలుసుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలకు మోదీ చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్, బాధితుల తరలింపు జరిగిన తీరును అధికారులు ప్రధానికి వివరించారు. సహాయక శిబిరాలు, ఆసుపత్రులకు వెళ్లి బాధితులను మోదీ పరామర్శించారు. అనంతరం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
వాయుసేన హెలికాప్టర్‌లో!
శనివారం ఉదయం 11 గంటలకు మోదీ కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధానికి స్వాగతం పలికారు. అనంతరం వీరంతా వాయుసేన హెలికాప్టర్‌లో వయనాడ్‌కు బయల్దేరారు. ఆ మార్గంలోనే కొండచరియలు విరిగిపడి తీవ్రంగా దెబ్బతిన్న ముండక్కై, చురాల్‌మల తదితర ప్రాంతాల్లో ప్రధాని విహంగ వీక్షణం చేశారు. ప్రధాని వెంట కేంద్రమంత్రి సురేశ్ గోపి కూడా ఉన్నారు.
బాధితులను పరామర్శించి!
కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించిన మోదీ, అక్కడి పునరావాస కేంద్రంలో తలదాచుకున్న వారితోపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం వయనాడ్ విలయంపై మోదీ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్రమంత్రి సురేశ్ గోపి పాల్గొన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ను ప్రధానికి వివరించారు అధికారులు.