Modi Lok Sabha Elections :లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క భారతీయ జనతా పార్టీనే 370 సీట్లు గెలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. గత ఎన్నికలతో పోలిస్తే ఒక్కో బూత్‌లో 370 ఓట్లు అదనంగా పోలయ్యేలా చూడాలని కార్యకర్తలను కోరారు. పార్లమెంట్లో ప్రతిపక్ష నేతలు కూడా ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయని అంటున్నారంటూ పరోక్షంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలను ప్రస్తావించారు.
డబుల్ ఇంజిన్ ప్రభుత్వం- డబుల్ స్పీడ్!
మధ్యప్రదేశ్‌లో ఆదివారం పర్యటించారు ప్రధాని మోదీ. రూ.7,550 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఝబువా జిల్లాలో ఏర్పాటు చేసిన గిరిజనుల బహిరంగ సభలో ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసమే తాను ఇక్కడికి రాలేదని, ప్రజా సేవకుడిగా మాత్రమే వచ్చానంటూ ఆదివాసీ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రెట్టింపు వేగంతో పనిచేస్తోందని కితాబు ఇచ్చారు.
'కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం పక్కా
తమ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని మోదీ తెలిపారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌కు మాత్రం ఎన్నికల సమయంలోనే గ్రామాలు, పేదలు, రైతులు గుర్తుకొస్తారని విమర్శించారు. 2024లో కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమన్నారు. ఓట్ల కోసం కాదని, గిరిజనుల ఆరోగ్యం కోసమే సికిల్ సెల్ ఎనీమియాపై పోరాట యాత్ర ప్రారంభించామని మోదీ తెలిపారు. మరికొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఏడాది ప్రధాని మోదీ మధ్యప్రదేశ్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
కాంగ్రెస్ నినాదం అదే
"కాంగ్రెస్ పార్టీ నినాదం దోచుకోవడం, విభజించడమే. గుజరాత్‌లో గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు లేకపోవడం వల్ల విద్యాభ్యాసం కోసం పిల్లలు కిలో మీటర్ల మేర నడిచి వెళ్లాల్సి రావడం చూశాను. నేను సీఎం అయ్యాక ఆయా ప్రాంతాల్లో స్కూళ్లను తెరిపించాను. ఇప్పుడు గిరిజన పిల్లల కోసం దేశ వ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలలు ప్రారంభిస్తున్నాం. కాంగ్రెస్ ఇన్నేళ్లలో కేవలం 100 ఏకలవ్య స్కూళ్లను పెడితే బీజేపీ ప్రభుత్వం వచ్చిన గత పదేళ్లలో భారీ సంఖ్యలో స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నాం" అని మోదీ తెలిపారు.