Modi Interview Lok Sabha Polls :సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలో వస్తే దేశాభివృద్ధి కోసం తమ వద్ద పెద్ద ప్రణాళికలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అలాగే 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి పెట్టుకున్న లక్ష్యాల గురించి మోదీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎలక్టోరల్ బాండ్ల దగ్గర నుంచి భారతదేశంలో టెస్లా కార్ల వరకు అనేక విషయాలు గురించి మోదీ మాట్లాడారు. 'నా దగ్గర పెద్ద ప్రణాళికలు ఉన్నాయని చెప్పినప్పుడు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఎవరినీ భయపెట్టడానికి లేదా పారిపోవడానికి నిర్ణయాలు తీసుకోను. దేశ అభివృద్ధి కోసమే నిర్ణయాలు తీసుకుంటా. నేను చేయాల్సింది చాలా ఉంది' అని మోదీ అన్నారు.
జమిలి ఎన్నికలతో ప్రయోజనం
"మీరు సరైన అంశాన్ని లేవనెత్తారు. ఒకే దేశం ఒకే ఎన్నికలనేది మా నిబద్ధత. మేము పార్లమెంట్‌లో మాట్లాడాం. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశాం. కమిటీ నివేదిక కూడా వచ్చింది. ఒకే దేశం-ఒకే ఎన్నికల పరంగా దేశంలో చాలా మంది తమ సలహాలను కమిటీకి అందించారు. చాలా సానుకూలమైన, వినూత్నమైన సూచనలు వచ్చాయి. మేము ఈ నివేదికను అమలు చేయగలిగితే దేశానికి ఎంతో మేలు జరుగుతుంది." అని మోదీ అన్నారు.
నిబద్దత ఉండాలి
"అభ్యర్థులే కాదు ఎన్నికల్లో ప్రతీ మద్దతుదారుడు చాలా ముఖ్యం. ఎన్నికల్లో బూత్ లెవల్ కార్యకర్త కూడా చాలా ముఖ్యం. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో ఒక పదం పట్ల నిబద్ధత, బాధ్యత ఉండడం లేదు. ఒక నాయకుడి ఇప్పటి ఆలోచనకు విరుద్ధగా ఉన్న పాత వీడియోలను ప్రస్తుతం సోషల్ మీడియాలో చలామణి అవుతున్నాయి. ఆ నాయకుడి అప్పటి ఆలోచనలు, ఇప్పటి ఆలోచనలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇటీవలే ఓ నాయకుడు నేను ఒక్క దెబ్బతో పేదరికాన్ని నిర్మూలిస్తాను అని అన్నారు. వీరికి అయిదు, ఆరు దశాబ్దాలు అధికారంలో ఉండే అవకాశం వచ్చింది. అయినా ఏం చేయని వారు ఇప్పుడు పేదిరకాన్ని ఒక్క దెబ్బతో నిర్మూలిస్తానని ప్రకటిస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఏం మాట్లాడుతున్నారని దేశం అనుకుంటోంది. ఇలాంటి రాజకీయ నాయకత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయని నాకు అనిపిస్తోంది. మనం ఏం మాట్లాడుతున్నామో దానికి మనం బాధ్యత తీసుకోవాలి. అది చేస్తాం ఇది చేస్తాం అనే మాటలు చెల్లవు. నేను అన్న మాటకు కట్టుబడి ఉంటాను. దానికి పూర్తి బాధ్యత వహిస్తాను. 370 అధికరణను ఉపసంహరిస్తామని బీజేపీ పుట్టినప్పటి నుంచి చెప్తున్నాం. దీనికోసం శ్యామా ప్రసాద్ ముఖర్జీ ప్రాణత్యాగం చేశారు. నాకు అవకాశం వచ్చింది. 370 ఆర్టికల్‌ను ఉపసంహరించాం. ఇవాళ జమ్ముకశ్మీర్‌లో మార్పు వచ్చింది. మనం ముందుకు వెళ్లాలంటే బాధ్యతగా ఉండాలి" అని మోదీ తెలిపారు.
ఎలక్టోరల్ బాండ్ల తప్పుడు నిర్ణయమా?
'ఎలక్టోరల్ బాండ్లు లేకపోతే డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో? ఎవరు? ఎలా ఇచ్చారు? అనే విషయాలు తెలుసుకునే అధికారం ఉండేది కాదు. ఇది ఎలక్టోరల్ బాండ్ల విజయగాథ. అందుకే మీకు డబ్బు దొరుకుతోంది. నిర్ణయం తీసుకోవడంలో లోపాలు లేవని నేను ఎప్పడూ చెప్పను. నిర్ణయాధికారం, మనం నేర్చుకుని, మెరుగుపరచడం చాలా సాధ్యమే. కానీ ఎన్నికల సమయంలో దేశం పూర్తిగా నల్లధనం వైపునకు నెట్టివేశారు. దీంతో ప్రతిపక్షాలు నిజాయితీగా ఆలోచించినప్పుడు, ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపపడతారు. బీజేపీకి 37% శాతం నిధులు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వస్తే ప్రతిపక్షానికి 63% శాతం వచ్చింది' అని మోదీ పేర్కొన్నారు.