Meta India Apologises To India :భారత ప్రభుత్వానికి 'మెటా ఇండియా' క్షమాపణలు చెప్పింది. భారత్‌లో 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తమ కంపెనీ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు తప్పేనని మెటా ఇండియా అంగీకరించింది. జుకర్‌బర్గ్ అనుకోకుండా చేసిన పొరపాటును క్షమించాలని కోరింది.
క్షమించండి!
భారత ప్రభుత్వానికి సారీ చెబుతూ మెటా ఇండియా ఉపాధ్యక్షుడు శివనాథ్ థుక్రాల్ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ‘‘మా కంపెనీ సీఈఓ జుకర్‌బర్గ్ పొరపాటున ఆ వ్యాఖ్యలు చేశారు. 2024లో వివిధ ప్రపంచదేశాల్లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో వివిధ దేశాల్లో అధికార పార్టీలు ఓడిపోయాయి. అయితే అధికార పార్టీలు ఓడిపోయిన దేశాల్లో భారత్ లేదు’’ అని శివనాథ్ థుక్రాల్ స్పష్టం చేశారు. ‘‘గౌరవనీయులైన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ - మార్క్ జుకర్‌బర్గ్ చేసిన వ్యాఖ్యలు భారత్‌ను ఉద్దేశించినవి కావు. ఆయన పేర్కొన్న దేశాల జాబితాలో భారత్ లేదు’’ అని ఆయన స్పష్టం చేశారు. ‘‘మెటా కంపెనీకి భారత్ చాలా ముఖ్యమైన స్థానం. వైవిధ్యభరిత, వినూత్నమైన సాంకేతిక ప్రపంచం దిశగా మెటా కంపెనీ చేస్తున్న ఆవిష్కరణలకు భారత్ అత్యంత ప్రాధాన్యం కలిగిన వేదిక’’ అని శివనాథ్ థుక్రాల్ వెల్లడించారు.
జుకర్‌బర్గ్‌కు సమన్లు
అంతకుముందు మార్క్ జుకర్‌బర్గ్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (కమ్యూనికేషన్స్ అండ్ ఐటీ) అధిపతి నిశికాంత్ దూబే విరుచుకుపడ్డారు. జుకర్‌బర్గ్‌పై విమర్శలు గుప్పిస్తూ వారు ఎక్స్ వేదికగా పోస్ట్‌లు పెట్టారు. ఈ వ్యవహారంపై వివరణ కోరుతూ మెటా కంపెనీకి నిశికాంత్ దూబే సమన్లు జారీ చేశారు. జనవరి 20 నుంచి 24 తేదీల మధ్య పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరై జుకర్ బర్గ్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని మెటా ఇండియాను ఆదేశించారు.
అందుకే మోదీ మళ్లీ ప్రధాని అయ్యారు!
‘‘భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక వ్యవస్థ. 2024లో కోట్లాది మంది ఓటర్లతో భారత్‌లో విజయవంతంగా ఎన్నికల ప్రక్రియ జరిగింది. మరోసారి భారతీయులు ప్రధాని మోదీ నాయకత్వాన్ని విశ్వసించారు. మళ్లీ ఎన్డీయే కూటమికే అధికార పట్టం కట్టారు’’ అని ఇటీవలే అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 2024 ఎన్నికల్లో భారత్‌లో అధికార పార్టీ ఓడిపోయిందనే జుకర్‌బర్గ్ వాదనను ఆయన ఖండించారు. జుకర్‌బర్గ్ చెప్పినట్టుగా కరోనా సంక్షోభ కాలంలో భారత్‌లో అడ్డదిడ్డమైన నిర్ణయాలేవీ తీసుకోలేదన్నారు. మోదీ సర్కారు దేశంలో 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఆహారాన్ని అందించిందని పేర్కొన్నారు. ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ను సైతం అందించామని తెలిపారు. ప్రజా విశ్వాసం ఉన్నందు వల్లే 2024 ఎన్నికల్లో మోదీ మళ్లీ ప్రధాని అయ్యారన్నారు.