Medicines Offered To God Shiva :ఎక్కడైనా దేవుడికి నైవేద్యంగా పండ్లు, ఫలహారాలు వంటివి పెడుతుంటారు భక్తులు. అయితే ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలు పెడుతుంటారు. అసలేందుకు ఇలా చేస్తున్నారు? ఆ శివాలయం ప్రత్యేకత ఏంటి? తెలుసుకుందాం పదండి.
ముందుగా శివయ్యకే సమర్పణ
రాసేశ్వర్ మహాదేవ్ ఆలయం బనారస్ హిందూ యూనివర్సిటీలో ఉంది. ఈ యూనివర్సిటీకి చెందిన అయుర్వేద అధ్యాపక బృందం పలు రకాల రోగాల నివారణ కోసం మందులు, ఔషధాలను తయారుచేస్తుంది. ఔషధాల తయారీ తర్వాత వాటిని శివుడికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు. భోలేనాథ్ ఆరాధనకు శాస్త్రోక్తంగా విశిష్టత ఉందని హిందూ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ ఆనంద్ చౌదరి చెబుతున్నారు. తాము ఏదైనా ఔషధాన్ని తయారుచేసినప్పుడల్లా దాన్ని మొదట శివుడికి సమర్పిస్తామని తెలిపారు. ఈ సంప్రదాయాన్ని చాలా ఏళ్ల క్రితం నుంచి పాటిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని మదన్ మోహన్ మాలవీయ రాసేశ్వర మహాదేవ్ ఆలయాన్ని నిర్మించారని వెల్లడించారు.
"ఆయుర్వేద శాఖ పరిధిలో ఏ ఔషధం తయారుచేసినా ముందుగా శివుడికి, ఆ తర్వాత ధన్వంతరికి సమర్పిస్తాం. రోగాలను తొలగించే దేవుడు రాసేశ్వర్ మహాదేవ్ అని నమ్ముతాం. దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభణ సమయంలోనూ పరిశోధకులు తయారుచేసిన కషాయాలను దేవుడి వద్ద పెట్టాం. ప్రజలకు జీవితాన్ని అందించిన భోలేనాథ్‌కు ఏ ఔషధమైనా మొదట అంకితం చేస్తాం." అని ఆనంద్ చౌదరి తెలిపారు.