Marriage Postponed For IPL Match In Assam: భారత్‌లో క్రికెట్‌కు మంచి ఆదరణ ఉంది. అందులోనూ ఐపీఎల్ అంటే ఫ్యాన్స్ మరింత పిచ్చెక్కిపోతుంటారు. మ్యాచ్‌ను చూడడానికి ఉద్యోగులు ఆఫీసుకు లీవ్‌లు పెట్టడం, విద్యార్థులు కాలేజీ ఎగ్గొట్టడం చేస్తుంటారు. అయితే త్రిపురకు చెందిన ఓ క్రికెట్ అభిమాని కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌ను చూసేందుకు పెళ్లి వేదిక నుంచి వచ్చేశాడు. దీంతో పెళ్లి వాయిదా పడింది.
అసలేం జరిగిందంటే?
త్రిపురకు చెందిన ఓ వ్యక్తికి కొన్నాళ్ల క్రితం వివాహం కుదిరింది. అతడి పెళ్లి ఆదివారం(మే 19)న జరగాల్సి ఉంది. అయితే ఆ వ్యక్తికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అలాగే ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు వీరాభిమాని. ఈ క్రమంలో మే 19న కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య గువహటిలోని బార్సపరా స్టేడియంలో జరగనున్న మ్యాచ్ కోసం వివాహాన్ని వాయిదా వేసుకున్నాడు. వెంటనే అసోంలోని గువాహటిలోని బార్సపరా స్టేడియానికి పెళ్లి దుస్తులతో వెళ్లాడు. దీంతో స్టేడియంలో మ్యాచ్ చూడడానికి వచ్చిన వారు ఆశ్చర్యానికి గురయ్యారు. అతడితో ఫొటోలు దిగారు.
అయితే పెళ్లిని వాయిదా వేసుకుని మరి కేకేఆర్, ఆర్ ఆర్ మధ్య జరిగే మ్యాచ్‌ను చూసేందుకు వెళ్లిన వ్యక్తికి షాక్ తగిలింది. ఎందుకంటే ఆ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే వర్షం కారణంగా రద్దు అయ్యింది. దీంతో ఐపీఎల్-17 లీగ్ దశ చివరి మ్యాచ్ వర్షార్పణం అయ్యింది. కాగా, ఈ ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లేఆఫ్స్‌కు చేరుకున్నాయి.