Modi About Manmohan Singh : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. శుక్రవారం ఉదయం దిల్లీలోని మన్మోహన్ సింగ్ ఇంటికి వెళ్లిన ముర్ము, జగ్‌దీప్‌ధన్‌ఖడ్ ఆయన భౌతిక ఖాయం వద్ద అంజలి ఘటించారు. అనంతరం కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
భావి తరాలకు ఆదర్శం
మన్మోహన్ సింగ్‌కు నివాళులు అర్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన జీవితం భావి తరాలకు ఆదర్శం అని కొనియాడారు.
"ఆర్థికవేత్తగా, సంస్కరణల సారథిగా మన్మోహన్ సింగ్‌ను దేశం గుర్తుంచుకుంటుంది. ఆర్‌బీఐ గవర్నర్ సహా అనేక కీలక పదవుల్లో ఉంటూ దేశానికి ఆయన ఎనలేని సేవలందించారు. పీవీ హయాంలో ఆర్థికమంత్రిగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చివేశారు. దేశం, ప్రజల పట్ల ఆయన సేవాభావం స్మరించుకోదగినది. విలక్షణ పార్లమెంటేరియన్‌గా ఆయన సేవలు అందించారు. ఎన్నో కీలక పదవులు చేపట్టినా నిరాడంబర జీవితం గడిపారు. జాతీయ, అంతర్జాతీయ అంశాలపై ఆయనతో చాలాసార్లు మాట్లాడాను. మన్మోహన్ సింగ్ జీవితం భావి తరాలకు ఒక ఆదర్శం. ఆయన మృతి విచారకరం. నా తరఫున, దేశ ప్రజల తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను."
- ప్రధాని నరేంద్ర మోదీ
సెల్యూట్
భారత సైన్యం తరఫున సైనికాధికారులు మాజీ ప్రధానికి నివాళి అర్పించారు. మన్మోహన్ పార్థివదేహాన్ని ఉంచిన పేటికపై జాతీయ జెండా ఉంచి సెల్యూట్ చేశారు.
కాంగ్రెస్ ఘన నివాళి
కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియాగాంధీ, మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ - మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు అర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ప్రియాంకాగాంధీ వాద్రా, ఆమె భర్త రాబర్ట్ వాద్రా సైతం మన్మోహన్ నివాసానికి చేరుకున్నారు. మన్మోహన్ ఎల్లప్పుడూ ప్రజల గురించే ఆలోచిస్తూ దేశ అభివృద్ధికి కృషి చేసేవారని రాబర్ట్ వాద్రా ఈ సందర్భంగా తెలిపారు. ఆర్థిక రంగంపై ఆయనకు మంచి పట్టు ఉందని అన్నారు.
మన్మోహన్ సింగ్ యూపీఏ హయాంలో 2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీతో, గాంధీ కుటుంబంతో ఆయనకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి.
7 రోజులు సంతాప దినాలు
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను పూర్తి అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అలాగే ఆయన మృతికి సంతాప సూచికంగా 7 రోజులు సంతాప దినాలను ప్రకటించింది. ప్రజల సందర్శనార్థం శనివారం ఆయన భౌతికకాయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి తీసుకురానున్నారు. శనివారం (డిసెంబరు 28) రాజ్‌ఘాట్ సమీపంలో ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.