Manipur CM N Biren Singh Tenders Resignation :మణిపుర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. ఇంఫాల్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. ఆయన వెంట బీజేపీ, ఎన్‌పీఎఫ్ పార్టీలకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, మణిపుర్ రాష్ట్ర బీజేపీ చీఫ్ ఎ.శారద, పార్టీ సీనియర్ నేత సంబిత్ పాత్ర ఉన్నారు. ఫిబ్రవరి 10 నుంచి మణిపుర్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సెషన్‌లో బీరెన్ సింగ్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడతామని కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రోజు(ఫిబ్రవరి 7న) ప్రకటించింది.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు శనివారం రోజు (ఫిబ్రవరి 8న) అధికార ఎన్‌డీఏ కూటమి ఎమ్మెల్యేలతో బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి సచివాలయంలో భేటీ అయ్యారు. బీజేపీ పెద్దల నుంచి పిలుపు రావడం వల్ల ఆదివారం ఉదయం బీరేన్ సింగ్ హుటాహుటిన దిల్లీకి వెళ్లారు. అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. దిల్లీ నుంచి ఇంఫాల్‌కు తిరిగి వచ్చిన వెంటనే బీరేన్ సింగ్ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి, గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు రాజీనామా లేఖను అందించారు. మణిపుర్ అసెంబ్లీ సెషన్‌కు సరిగ్గా ఒకరోజు ముందు ఈ పరిణామం జరగడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.