తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మండ్యలో నువ్వానేనా- కుమారస్వామి గెలిచేనా? - Mandya Lok sabha election 2024

Mandya Lok Sabha Election 2024 : మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ కుమారుడు కుమారస్వామి పోటీ చేస్తున్న మండ్య లోక్‌సభ స్థానంలో పరిస్థితేంటి? కాంగ్రెస్ అభ్యర్థి స్టార్ చంద్రు నుంచి పోటీ ఎలా ఉండబోతోంది? నటి సుమలత మద్దతుతో కుమారస్వామి ఈ ఎన్నికల్లో గట్టెక్కగలుగుతారా? లోక్‌సభ పరిధిలోని మెజారిటీ ఎమ్మెల్యేల బలాన్ని కలిగిన కాంగ్రెస్ అభ్యర్థి విజయాన్ని కుమార అడ్డుకోగలరా?

Mandya Lok Sabha Election 2024
Mandya Lok Sabha Election 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 14, 2024, 6:31 PM IST

Mandya Lok Sabha Election 2024 : మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పోటీ చేస్తున్న మండ్య లోక్‌సభ స్థానం వైపే అందరి చూపు ఉంది. కర్ణాటకలో వక్కలిగ సామాజిక వర్గానికి గుండెకాయగా పేరొందిన మండ్య స్థానంలో ఎలాంటి ఫలితం వస్తుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. వాస్తవానికి మండ్య నుంచి సిట్టింగ్ ఎంపీగా ప్రముఖ నటి సుమలత ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న సుమలత, ఎన్‌డీఏ కూటమిలో మిత్రపక్షంగా ఉన్న జేడీఎస్‌కు తన సీటును వదులుకున్నారు. దీంతో మండ్య నుంచి బీజేపీ, జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా కుమారస్వామి బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుంచి స్టార్ చంద్రు(వెంకట రమణె గౌడ) పోటీ చేస్తున్నారు.

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బలం కాంగ్రెస్‌కే
సిట్టింగ్ ఎంపీ సుమలత మద్దతు ప్రకటించడం కుమారస్వామికి ప్లస్ పాయింట్‌గా మారబోతోంది. బీజేపీ మద్దతు ఆయన విజయానికి బాటలు వేసే కీలకమైన అంశం. మండ్య ప్రాంతంలో భారీ సంఖ్యలో ఉన్న వక్కలిక సామాజిక వర్గం, మాజీ ప్రధానమంత్రి దేవెగౌడపై ఉన్న అభిమానం కూడా కుమారస్వామికి కలిసొచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి స్టార్ చంద్రుకు మండ్యలో కలిసొచ్చే అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. మండ్య లోక్‌సభ స్థానం పరిధిలోని మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. జేడీఎస్‌, సర్వోదయ కర్ణాటక పక్షకు చెరో ఎమ్మెల్యే ఉన్నారు. మండ్య లోక్‌సభ స్థానం పరిధిలోని ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్నారు. అదనంగా ఇద్దరు ఎమ్మెల్సీల బలం కూడా హస్తం పార్టీకి ఉంది. ఈ కోణంలో చూస్తే హెచ్‌డీ కుమారస్వామికి విజయం అంత సులువు కాదు. ఎందుకంటే ప్రస్తుత మెజారిటీ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు.

కరిష్మాలో ఆయన ముందంజ
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మండ్య లోక్‌సభ స్థానం పరిధిలో ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటును జేడీఎస్ గెలవగలిగింది. ఇంత తక్కువ ప్రాబల్యంతో ఇప్పుడు ఏకంగా లోక్‌సభ సీటును చేజిక్కించుకోవడం అంత సులువు కాదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. వక్కలిక సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్ ప్రస్తుతం కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వక్కలిగ సామాజిక వర్గానికి గుండెకాయగా పేరొందిన మండ్య స్థానాన్ని కాంగ్రెసే గెలవాలనే లక్ష్యంతో ఆయన కూడా పెద్దఎత్తున స్థానికంగా ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల వేళ డీకే శివకుమార్‌కు సీఎం సీటు ఇవ్వలేదనే విస్మయం వక్కలిగ వర్గంలో ఉంది. దీన్ని ఈ ఎన్నికల్లో వక్కలిగ ఓటర్లు ఏవిధంగా తెలియజేస్తారు?ఎలాంటి తీర్పును ఇస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. హెచ్‌డీ కుమారస్వామితో పోలిస్తే కాంగ్రెస్ అభ్యర్థి స్టార్ చంద్రుకు కరిష్మా తక్కువే. నటి సుమలత కరిష్మా కూడా ఈసారి కుమారస్వామికే కలిసి రానుంది విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే ఆమె ఈసారి కుమారస్వామి తరఫునే ప్రచారం చేయబోతున్నారు.

పదేళ్ల తర్వాత మండ్యపై కన్ను
హెచ్‌డీ కుమారస్వామి హసన్ జిల్లాకు చెందినవారు. మండ్య పొరుగున ఉన్న రామనగర నుంచి ఆయన రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి స్టార్ చంద్రు నాగమంగళ తాలూకాకు చెందినవారు. ఇక మండ్య విషయానికొస్తే ఇది బెంగళూరు, మైసూరు నగరాల మధ్య ఉంది. పాత మైసూరు పరిధిలోని వక్కలిగ రాజకీయాలకు ఇదే కేంద్రబిందువు. ఇంతకుముందు ఇక్కడ బీజేపీ బలహీనంగా ఉండేది. కానీ ఇటీవలి సంవత్సరాలలో చాలా పుంజుకుంది. పదేళ్ల పెద్ద గ్యాప్ తర్వాత ఈసారి మండ్యను ఎలాగైనా గెల్చుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటకలోని గౌరిబిదనూరుకు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే కెహెచ్ పుట్టస్వామి గౌడ కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. దీనికి ప్రతిగా ఆయన సోదరుడు కాంట్రాక్టర్​ స్టార్ చంద్రుకు కాంగ్రెస్ పార్టీ మండ్య లోక్‌సభ టికెట్‌ను కేటాయించింది.

2019లో ఏమైందో తెలుసా?
2019 మండ్య లోక్‌సభ ఎన్నికల్లో పోటీ ఎంతో భిన్నమైన నేపథ్యాల మధ్య జరిగింది. ఇప్పుడు స్నేహ హస్తం చాచుకున్న పార్టీలే, ఆనాడు విమర్శనాస్త్రాలను సంధించుకున్నాయి. అప్పట్లో బీజేపీ మద్దతుతో నటి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో కాంగ్రెస్- జేడీఎస్ ఉమ్మడి అభ్యర్థిగా నిఖిల్ కుమారస్వామి పోటీ చేసి ఓడిపోయారు. ఆనాడు సుమలతకు దాదాపు 1.25 లక్షల ఓట్ల ఆధిక్యం వచ్చింది.

దేవెగౌడ ఫ్యామిలీ పాలిటిక్స్​- ఒకే కుటుంబం నుంచి బరిలో 9మంది- ఎక్కడ చూసినా వాళ్లే! - Devegowda Family In Politics

కర్ణాటకలో ఆసక్తికర సమరం- బీజేపీ, కాంగ్రెస్ టఫ్​ ఫైట్​- రెండు పార్టీలకూ కీలకమే! - Lok Sabha Election 2024 Karnataka

ABOUT THE AUTHOR

...view details