Sukhbir Badal Attacked : పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్‌సింగ్ బాదల్‌పై కాల్పులు జరిగాయి. మతపరమైన శిక్ష అనుభవించేందుకు స్వర్ణ మందిర్ చేరుకున్న సమయంలో ఓ దుండగుడు బాదల్‌పై కాల్పులు జరిపాడు. పక్కన నిలుచున్న భద్రతా సిబ్బంది అప్రమత్తతతో తృటిలో బాదల్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నిందితుడికి ఖలీస్థాన్ ఉగ్రముఠాతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అసలేం జరిగిందంటే?
శిక్షలో భాగంగా స్వర్ణ దేవాలయ ప్రవేశద్వారం వద్ద సుఖ్‌బీర్ చక్రాల కుర్చీపై కూర్చొని సేవాదార్ (కాపలాదారుడు)గా ఉండగా ఓ వృద్ధుడు ఆయన దగ్గరకు వచ్చాడు. కొన్ని అడుగుల దూరంలోనే ఉన్న అతడు ప్యాంట్ జేబులోంచి తుపాకీ తీసి సుఖ్‌బీర్‌పై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే సుఖ్‌బీర్ పక్కన నిలుచున్న భద్రతా సిబ్బంది దుండగుడి అనుమానాస్పద కదలికలను పసిగట్టారు. తుపాకీ తీసి కాల్చే లోపే దుండగుడిని పక్కకు తోసేశారు. దీంతో తుపాకీ గురితప్పి ఆ తూటా సుఖ్‌బీర్ పక్కనున్న గోడకు తగిలింది. దీంతో సుఖ్‌బీర్‌కు ఎలాంటి హాని జరగలేదు.
ఉగ్రముఠాతో సంబంధాలు
సుఖ్‌బీర్‌పై కాల్పులు జరిపిన నిందితుడిని వెంటనే బంధించారు. గుర్దాస్‌పుర్ జిల్లాకు చెందిన నరేన్ సింగ్‌గా గుర్తించారు. అతడికి ఖలిస్థానీ ఉగ్రముఠా బబ్బర్ ఖల్సాతో సంబంధాలున్నట్లు పోలీసులు తెలిపారు. 2004లో బురేల్ జైల్-బ్రేక్ కేసులో ఇతడి హస్తం ఉందని, ఆ ఘటనలో నలుగురు బబ్బర్‌ఖల్సా ముఠా సభ్యులు జైలు నుంచి తప్పించుకున్నారని వెల్లడించారు.
బుధవారం దాడిని ఆపింది రిష్‌పాల్ సింగ్, జస్బీర్‌సింగ్, పర్మీందర్ సింగ్ అనే పోలీసులని అమృత్‌సర్ సీపీ గుర్‌ప్రీత్ సింగ్ భుల్లర్ తెలిపారు. సకాలంలో వారు అప్రమత్తమయ్యారని అభినందించారు. మత విశ్వాసాల కారణంగా స్వర్ణమందిర్ ప్రాంగణంలో పోలీసులను యూనిఫాంలో మోహరించేందుకు అనుమతి లేదని సీపీ వివరించారు.
శిరోమణి అకాలీదళ్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో సుఖ్‌బీర్ సింగ్ బాదల్ మతపరమైన తప్పిదాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. సుఖ్‌బీర్ సింగ్ బాదల్ సహా ఆయన అనుచరులు 2007-2017 మధ్య అధికారంలో ఉన్న సమయంలో తప్పులు, మతపరమైన దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని ఆగస్టులో అకాల్ తఖ్త్ తేల్చింది. ఈ విషయంలో పార్టీ చీఫ్ సుఖ్‌బీర్‌ను దోషిగా తేల్చింది. సేవకుడిగా అమృత్‌సర్‌లోని స్వర్ణదేవాలయంలో పాత్రలు, బూట్లు శుభ్రం చేయాలని ఆదేశించింది. మంగళవారం తొలిరోజు ఆ శిక్షను సుఖ్‌బీర్ అనుభవించారు. రెండోరోజు శిక్ష అనుభవించేందుకు స్వర్ణమందిర్ వెళ్లారు. మెడలో తప్పు చేసినట్లు రాసి ఉన్న పలకను ధరించి ద్వారం వద్ద కూర్చున్న కొంతసేపటికే ఈ ఘటన జరిగింది.