Mamata Banerjee On Her Brother :బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక ప్రకటన చేశారు. తన తమ్ముడు బాబూన్ బెనర్జీతో బంధుత్వాన్ని తెగదెంపులు చేసుకుంటున్నట్లుగా ప్రకటించారు. ఇందుకు గల ప్రధాన కారణాన్ని కూడా ఆమె జల్పాయిగుడిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బుధవారం తెలియజేశారు.
'తృణమూల్ కాంగ్రెస్ హవ్డా లోక్‌సభ టికెట్‌ను నా తమ్ముడు బాబూన్ బెనర్జీని కాదని పార్టీలో మరో ముఖ్య నేతగా కొనసాగుతున్న ప్రసూన్ బెనర్జీకి కేటాయించాం. ఇది బాబూన్కు ఏ మాత్రం మింగుడుపడటం లేదు. పైగా పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన ఎప్పుడూ ఇలానే చేస్తారు. ఎన్నికలకు ముందు ఏదో రకంగా సమస్య సృష్టిస్తారు. అత్యాశపరులను నేను ఆదరించను. వారసత్వ రాజకీయాలను నేను నమ్మను, వాటికి దూరంగా ఉంటాను. అందుకే ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఇక ఆయనతో పూర్తిగా బంధుత్వాన్ని తెగదెంపులు చేసుకుంటున్నాను' అని దీదీ స్పష్టం చేశారు.
'ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తా'
తన సోదరుడు బాబూన్ బెనర్జీ బీజేపీలో చేరే అవకాశం ఉందని వస్తున్న వార్తలపై కూడా సమాధానమిచ్చారు దీదీ. 'ఆయనకు నచ్చింది ఆయన చేసుకుంటారు. కానీ, పార్టీ మాత్రం తన అధికారిక అభ్యర్థి ప్రసూన్ బెనర్జీకి అండగా నిలుస్తుంది' అని తేల్చి చెప్పారు బంగాల్ సీఎం. ఇక ఇదే విషయమై ప్రస్తుతం దిల్లీలో ఉన్న బాబూన్ను ప్రశ్నించగా ప్రస్తుతం బీజేపీలో చేరే అవకాశం లేదని, వీలైతే స్వతంత్ర అభ్యర్థిగానైనా హవ్డా లోక్‌సభ సీటు నుంచి బరిలోకి దిగుతానని, దీనిపై సమాలోచనలు చేస్తున్నట్లు తెలిపారు.