Mallikarjun Kharge On BJP : దేశ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన గ్యారెంటీలు 2004లో ఇండియా షైనింగ్ నినాదం మాదిరిగానే మిగలనున్నాయని విమర్శించారు. సార్వత్రిక సమరానికి సంబంధించిన ఎన్నికల ప్రణాళిక ఆమోదించేందుకు జరిగిన పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి(CWC) సమావేశంలో మల్లికార్జున ఖర్గే మాట్లాడారు.
పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు ఖర్గే సూచించారు. మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కచ్చితంగా అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. అలాగే భారత్ జోడో యాత్ర, న్యాయ్ యాత్ర ద్వారా ప్రజల నిజమైన సమస్యలను రాహుల్ గాంధీ దేశం దృష్టికి తెచ్చారని కొనియాడారు.
మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఈ సమావేశానికి ఖర్గే, పార్టీ మాజీ చీఫ్‌లు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరయ్యారు. అంబికా సోనీ, ప్రియాంక గాంధీ, పి చిదంబరం, దిగ్విజయ్ సింగ్, అజయ్ మాకెన్, కుమారి సెల్జాతో సహా ఇతర సీనియర్ నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మేనిఫెస్టో కమిటీకి చిదంబరం అధ్యక్షత వహించారు. లోక్సభ ఎన్నికల కోసం చేసిన పార్టీ మేనిఫెస్టోలోని కీలక అంశాలను చదివారు. అలాగే సీడబ్ల్యూసీకి మేనిఫెస్టోను ముసాయిదాను అందించారు. ఆ తర్వాత మేనిఫెస్టోను సీడబ్ల్యూసీ ఆమోదించనుంది.