Kerala Guinness Records Family :కేరళకు చెందిన ఓ కుటుంబం ప్రపంచ రికార్డులతో అదరగొడుతోంది. ఆ కుటుంబానికి చెందిన వారు వరుసగా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంటోంది. 'గిన్నీస్ ఫ్యామిలీ ఆఫ్ ఇండియా'గా పేరుగాంచిన అబ్దుల్ సలీం ఫ్యామిలీ ఇప్పుడు 'గిన్నీస్ ఫ్యామిలీ ఆఫ్ ది వరల్డ్'గా అవతరించడంపై దృష్టి సారిస్తున్నారు. అసలు ఆ ఫ్యామిలీలో ఎంత మంది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు? ఏయే విభాగాల్లో రికార్డులు సృష్టించారు? తదితర విషయాలు తెలుసుకుందాం.
అరటిపండు తిని గిన్నిస్ రికార్డులో చోటు కేరళలోని మలప్పురానికి చెందిన సలీం జీవితాన్ని ఓ అరటిపండు మార్చేసింది. ఏకంగా 'గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్'లో చోటు సంపాదించేలా చేసింది. అరటిపండు మనచేతికిస్తే తినడానికి కనీసం రెండు నిమిషాలైనా టైం తీసుకుంటాం. కానీ సలీం అలా కాదు. తినే క్రమంలో ఏమాత్రం చేతులను ఉపయోగించకుండా కేవలం 8.57 సెకన్లలో మొత్తం అరటిపండుని తినేసి గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కారు.
తన రికార్డు తానే బద్దలు అంతకుముందు 17.82 సెకన్లలో అరటిపండును చేతులు ఉపయోగించకుండా తిని సలీం తొలిసారిగా గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు. దీంతో 2021లో ఇంగ్లండ్‌కు చెందిన లేహ్ షట్ కేవర్ 20.33 సెకన్లతో నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టారు. ఈ ఏడాది మొదట్లో 9.7 సెకన్లలో అరటిపండు తిని సలీం రికార్డును ఫవాజ్ బద్దలుకొట్టారు. ఈ ఏడాది జులై 30న 8.57 సెకన్లలో అరటిపండును తిని తిరిగి టైటిల్‌ను పొందాడు సలీం. 2023లో 34.17 సెకన్లలో పసి పిల్లలు పాలు తాగే బాటిల్‌తో 2.50 లీటర్ల నీటిని తాగి గిన్నీస్ రికార్డుకెక్కాడు సలీం.
వారసత్వాన్ని నిలబెట్టిన కుమార్తెలు సలీం కుమార్తెలు కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించున్నారు. అయన కుమార్తె జువైరియా తన మోచేతులు, మోకాళ్లపై నడుస్తూ తలపై చేయిని ఉంచుతూ 54 మెట్లు ఎక్కింది. మరో కుమార్తె అయేషా సుల్తానా 16.50 సెకన్లులో ఆరోహణ, అవరోహణ క్రమంలో పుస్తకాలను అమర్చడం ద్వారా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సాధించింది.
ఇతర కుటుంబ సభ్యులు సైతం! ఇప్పటికే గిన్నీస్ రికార్డుల్లో సలీమ్‌తో పాటు అతని కుమార్తెలు చోటు దక్కించుకోవడం వల్ల ఇతర కుటుంబ సభ్యులకు ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో సలీం భార్య రషీద, మేనకోడలు కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు. సలీం భార్య రషీద 'మోస్ట్ స్టెప్-అప్స్' విభాగంలో శిక్షణ తీసుకుంటోంది. అలాగే సలీం కూడా ఒక్క నిమిషంలో 24 టమాటొలను ముక్కలు కోయడం, చేతులతో ముట్టుకోకుండా కప్ కేక్‌ను తినడం వంటి విభాగాల్లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు కోసం ప్రయత్నిస్తున్నారు.
కేరళకు చెందిన 65వ వ్యక్తి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్న కేరళకు చెందిన 65వ వ్యక్తి సలీం. మలప్పురానికి చెందిన మూడో వ్యక్తిగా నిలిచారు. సలీం సాధించిన విజయాలు భారతదేశ ప్రతిభకు నిదర్శనమని ఆల్ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్స్ కేరళ అధ్యక్షుడు సత్తార్ అదూర్ కొనియాడారు.
'ఈ అవార్డులు దేశానికి గర్వకారణం' "రికార్డులు బద్దలు కొట్టాలంటే సృజనాత్మకత, అంకితభావం, కష్టపడి పనిచేయడం అవసరం. ఈ విజయాలు కేవలం వ్యక్తిగత మైలురాళ్లు మాత్రమే కాకుండా మన దేశానికి గర్వకారణం. ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవడం అంటే ఇతరులను మీ అభ్యాసంలో భాగం చేసుకోవడమే. అదొక గౌరవం. కష్టపడితే ప్రతిదీ సాధ్యమే" అని సలీం చెప్పారు.