No LOP In Maharashtra Assembly :మహారాష్ట్రలో మహాయుతి సృష్టించిన ప్రభంజనం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక పరిస్థితికి దారితీసింది. ఆరు దశాబ్దాలలో తొలిసారిగా మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత(ఎల్ఓపీ) హోదా ఖాళీగా ఉండనుంది. ఈ మేరకు మహా వికాస్ అఘాడీ పార్టీలు కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ)కు ఎల్ఓపీ అవకాశం లేదని మహారాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి(లెజిస్లేచర్) అనంత్ కల్సే ఓ ప్రకటనలో తెలిపారు. కూటమి బలం ఆధారంగా ఎల్ఓపీని నామినేట్ చేయడం కుదరదని, నిబంధనల ప్రకారం ఏ పార్టీకి అయినా కచ్చితంగా కనిష్ఠ సంఖ్యలో సభ్యుల బలం ఉండాలని తెలిపారు. ఎమ్వీఏ ఎంత ఘోరంగా పరాజయం పాలైందో చెప్పడానికి ఈ పరిస్థితే నిదర్శనం.
మొత్తం 288 స్థానాల్లో మహాయుతి కూటమి 230 స్థానాల్లో విజయం సాధించింది. ఎల్ఓపీ హోదా రావాలంటే ప్రతిపక్ష పార్టీకి కచ్చితంగా 29 సీట్లు రావాలి. ఎమ్వీఏలో ఏ పార్టీకి ఇన్ని సీట్లు రాలేదు. చట్టం ప్రకారం మొత్తం సీట్లలో ప్రతిపక్ష పార్టీలు కనిష్ఠంగా 10శాతం స్థానాలు గెలుచుకోవాల్సి ఉంటుంది. శివసేన(యూబీటీ) 20 స్థానాలు గెలిచినా, ఎల్ఓపీ హోదాకు ఇంకా 9 సీట్లు తగ్గాయి.
శనివారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 16(101 స్థానాల్లో పోటీ చేసి), ఎన్సీపీ(ఎస్పీ) 10 సీట్లకు పరిమితమైంది. ఇక మహాయుతిలో బీజేపీ సింహభాగం 132(149 సీట్లలో పోటీ చేసి) స్థానాల్లో విజయం సాధించింది. శివసేన(శిందే) 57 సీట్లలో, ఎన్సీపీ(అజిత్) 41 సీట్లలో గెలుపొందాయి.