తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బీజేపీ అభ్యర్థే మహారాష్ట్ర సీఎం' - డిసెంబర్ 5నే ప్రమాణ స్వీకారం - అంతా ఫిక్స్​! - MAHAYUTI GOVT SWEARING IN

మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు - బీజేపీ అభ్యర్థే ముఖ్యమంత్రి అవుతారు: అజిత్ పవార్​

Mahayuti 2.0 govt
Mahayuti 2.0 govt (ANI)

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2024, 8:12 PM IST

Updated : Nov 30, 2024, 8:43 PM IST

Mahayuti 2.0 Govt Swearing In :మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. డిసెంబర్‌ 5న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని భాజపా వెల్లడించింది. ముంబయిలోని ఆజాద్‌ మైదానంలో సీఎంతోపాటు, పలువురు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారని తెలిపింది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతారని వెల్లడించింది.

"మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి 2.0 కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం డిసెంబర్‌ 5న జరగనుంది" అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్‌ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు.

బీజేపీ అభ్యర్థే సీఎం!
మహారాష్ట్ర తదుపరి సీఎం బీజేపీ అభ్యర్థే అవుతారని ఎన్​సీపీ అధినేత అజిత్ పవార్ స్పష్టం చేశారు. మిత్రపక్షాల నుంచి ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని కూడా ఆయన తెలిపారు.

మహాయుతి 2.0 ఘన విజయం
మహారాష్ట్రలో మొత్తం 288 సీట్లు ఉండగా, మహాయుతి కూటమి ఏకంగా 233 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు మహావికాస్‌ అఘాడీ కూటమి కేవలం 51 చోట్ల మాత్రమే గెలుపొందింది. భాజపా 132 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించగా, శివసేన (శిందే) 57, ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) 41 స్థానాల్లో జయకేతనం ఎగురవేశాయి. మరోవైపు శివసేన (ఉద్ధవ్‌) పార్టీ 20 చోట్ల విజయం సాధించగా, కాంగ్రెస్‌ 16, ఎన్సీపీ (ఎస్‌పీ) 10 స్థానాలు గెలుచుకున్నాయి.

సీఎం రేసులో కొత్త పేర్లు!
మహాయుతి కూటమి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తరువాతే అసలు కథ మొదలైంది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఇంకా తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. తొలుత శిందే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని వార్తలు వచ్చాయి. కానీ తరువాత బీజేపీ నేత ఫడణవీస్‌ పేరు తెరమీదికి వచ్చింది. కానీ ఇప్పుడు సీఎం రేసులో ఫడణవీస్‌తోపాటు కేంద్రమంత్రి మురళీధర్‌, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే తదితరులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

భాజపా పుణె ఎంపీ అయిన మురళీధర్‌ ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. గతంలో పుణె మేయర్‌గా పనిచేశారు. భాజపా అగ్రనాయకత్వం మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి మురళీధర్​నే సూచిస్తున్నట్లు సమాచారం. సీఎం పదవికి పోటీపడుతున్న దేవేంద్ర ఫడణవీస్‌కు భాజపా జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ, ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉంటారని అందరూ భావిస్తున్నారు. తాజాగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ కూడా అదే చెప్పడం దీనికి మరింత ఊతమిస్తోంది.

ఇక కొత్త మంత్రి వర్గంలోకి సగం మందిని భాజపా నుంచి మిగతా సగం శివసేన, ఎన్సీపీ నుంచి తీసుకుంటారన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో శివసేనకు 12 మంత్రి పదవులిచ్చి, అందులో మూడు కీలక శాఖలు కేటాయిస్తారన్న వార్తలు వస్తున్నాయి.

Last Updated : Nov 30, 2024, 8:43 PM IST

ABOUT THE AUTHOR

...view details