Maharashtra Hit And Run Case : పుణెలో జరిగిన టీనేజర్ కారు ప్రమాదఘటన మరవకముందే ముంబయిలో అదే తరహా మరో ప్రమాదం నమోదైంది. శరవేగంగా వచ్చిన బీఎండబ్ల్యూ కారు రోడ్డుపై వెళుతున్న స్కూటీని ఢీకొట్టడం వల్ల వివాహిత మృతిచెందింది. ఆ కారు మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా శివసేన నేత రాజేష్ షాకు చెందినదిగా పోలీసులు తెలిపారు. నిందితుడిని షా కుమారుడైన యువనేత మిహిర్ షా (24)గా గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఆదివారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ముంబయిలోని వర్లీ ప్రాంతంలో మిహిర్ మద్యం మత్తులో బీఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు. దీంతో స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు. వేగంగా వెళ్తున్న కారు మహిళపై నుంచి దూసుకెళ్లడం వల్ల కావేరి నక్వా (45) అక్కడికక్కడే మరణించింది. ఆమె భర్త ప్రదీప్‌కు స్వల్పగాయాలయ్యాయి.
చేపలు అమ్ముకుంటూ జీవిస్తున్న ఈ దంపతులు ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. నిందితుడు పరారీలో ఉండటం వల్ల అతడి తండ్రితోపాటు ప్రమాదం జరిగినప్పుడు కారులోనే ఉన్న డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ప్రమాదం అనంతరం నిందితులు సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడు మిహిర్ శనివారం అర్ధరాత్రి ఓ బార్‌లో మద్యం తాగాడు.
తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో కారు తానే నడుపుతానని పట్టుబట్టి డ్రైవరు సీటులోకి మారి ప్రమాదానికి కారణమయ్యాడు మిహిర్. ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే స్పందించారు. చట్టం అందరికీ సమానమేనని తెలిపారు. ఎవరినీ విడిచిపెట్టబోమని చెప్పారు. పోలీసులు న్యాయం చేస్తారని, రాజకీయ ఆశ్రిత పక్షపాతం ఉండదని నమ్ముతున్నట్లు ఉద్ధవ్ వర్గం శివసేన నాయకుడు, స్థానిక ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. "వాహనం నడుపుతున్న వ్యక్తి వెంటనే బ్రేకులు వేసి కారు ఆపి ఉంటే మహిళ ప్రాణాలు నిలిచేవి. తప్పించుకుందామనే ఉద్దేశంతో ఆమెపైకి దూసుకెళ్లడం వల్ల ఆ మహిళ మృతి చెందింది" అని నాయకుడు సందీప్ దేశ్‌పాండే ఆరోపించారు.