CM Devendra Fadnavis Profile: 'నేను సముద్రంలాంటివాడిని, మళ్లీ తిరిగొస్తా'-- 2019లో సీఎం పదవి కోల్పోయిన తర్వాత దేవేంద్ర ఫడణవీస్ చెప్పిన మాట ఇది. ఆ తర్వాత 2022లో మహావికాస్ అఘాడీ నుంచి అధికారం దక్కించుకున్నా, ఫడణవీస్ డిప్యూటీ సీఎంకే పరిమితమయ్యారు. దాంతో స్థాయి తగ్గిందంటూ ప్రత్యర్థులు ఫడణవీస్‌ను గేలి చేశారు. రాజకీయ పద్మవ్యూహంలో చిక్కుకుపోయారని ఎద్దేవా చేశారు. కానీ, వాళ్లందరికీ తిరిగులేని సమాధానిస్తూ ఆధునిక అభిమన్యుడిలా రాజకీయ పద్మవ్యూహాన్ని ఛేదిస్తూ, ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు ఫడణవీస్.
మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కార్పొరేటర్ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు అంచెలంచెలుగా ఫడణవీస్ ఎదిగారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తానున్నానంటూ ముందుకొచ్చి మంచి విజయాలను అందిచడంలో దిట్టగా పేరొందారు ఫడణవీస్.
వ్యక్తిగత విషయాలు
మహా సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడణవీస్ 1970 జులై 22న జన్మించారు. ఆయన తండ్రి గంగాధరరావు ఫడణవీస్, తల్లి సరిత. ఫడణవీస్ తండ్రి గంగాధరరావు నాగ్‌పుర్ నుంచి మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేశారు. తల్లి సరితా ఫడణవీస్ విదర్భ హౌసింగ్ క్రెడిట్ సొసైటీ మాజీ డైరెక్టర్. గంగాధర ఫడణవీస్‌ను కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత నితిన్ గడ్కరీ పలుమార్లు తన రాజకీయ గురువుగా అభివర్ణించారు.
సోషల్ మీడియాలోనూ స్టారే
దేవేంద్ర ఫడణవీస్ భార్య అమృత బ్యాంకర్, సామాజిక కార్యకర్త. ఈ దంపతులకు దివిజా ఫడణవీస్ అనే కుమార్తె ఉంది. అలాగే ఫడణవీస్ సోషల్ మీడియాలోనూ స్టార్‌గా నిలిచారు. ఆయనకు ఎక్స్‌లో 59 లక్షలు, ఫేస్బుక్లో 91లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 20 లక్షలు, యూట్యూబ్‌లో 11 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీంతో మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుల్లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న నేతగా ఫడణవీస్ అవతరించారు.
ఫడణవీస్ రాజకీయ నేపథ్యం
- 1989లో RSSకు చెందిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విభాగంలో ఫడణవీస్ పనిచేశారు.
- 22 ఏళ్లకే నాగ్‌పుర్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.
- 27 ఏళ్లకే నాగ్‌పుర్ మేయర్‌గా ఎన్నికై అత్యంత పిన్న వయస్సులో మేయర్ అయిన వ్యక్తిగా రికార్డుకెక్కారు.
- 1999లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో నాగ్‌పుర్ సౌత్ వెస్ట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు.
- 2013లో మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు ఫడణవీస్. మహారాష్ర్టలో 2014 లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంలో దేవేంద్ర ఫడణవీస్ కీలక పాత్ర పోషించారు.
ఫస్ట్ టర్మ్‌లో అదుర్స్!
2014లో బీజేపీ, శివసేనతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీంతో ఫడణవీస్ మహారాష్ట్రకు తొలిసారి ముఖ్యమంత్రి అయ్యారు. తన మొదటి పదవీ కాలంలో సేవా హక్కు చట్టాన్ని అమలు చేశారు. అలాగే కరవును ఎదుర్కోవడమే లక్ష్యంగా 'జలయుక్త్ శివార్ అభియాన్'ను ప్రారంభించారు. దీంతో 22,000 కంటే ఎక్కువ గ్రామాల్లో రూ.6 లక్షల కంటే తక్కువ ఖర్చుతో కూడిన నీటి నిర్మాణాలను అభివృద్ధి చేశారు.
మౌలిక అభివృద్ధి ప్రాజెక్టులు సైతం
ముంబయి, పుణె మెట్రో విస్తరణ, నాగ్‌పుర్-ముంబయి సమృద్ధి ఎక్స్ ప్రెస్ వే, కోస్టల్ రోడ్ ప్రాజెక్ట్, ముంబయి ట్రాన్స్ హార్బర్ వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేశారు. తన మొదటి పదవీ కాలంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయడం సహా పాటు సుపారిపాలన సాగించిన సీఎంగా ప్రజల్లో ఫడణవీస్ ఆదరణ పొందారు.
రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా!
2022లో మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ఫడణవీస్ తన రాజకీయ చతురతను నిరూపించుకున్నారు. శివసేన అగ్రనేత ఏక్ నాథ్ శిందేకు సీఎం పగ్గాలు అప్పగించి, ఆయన ఉపముఖ్యమంత్రిగా కొనసాగారు. తాజాగా జరిగిన మహా ఎన్నికల్లో మహాయుతిని విజయం పథంలో నడిపించి మరోసారి సీఎం పగ్గాలు చేపట్టారు.
ఫడణవీస్ రికార్డులు
- మహారాష్ట్ర చరిత్రలో సీఎంగా పూర్తి పదవీకాలం పనిచేసిన రెండో ముఖ్యమంత్రి ఫడణవీస్. 2014-2019 ఫడణవీస్ మహా సీఎంగా కొనసాగారు. 1962-1967 వరకు వసంత్ రావు పూల్ సింగ్ నాయక్ సీఎంగా పూర్తి కాలం పనిచేశారు. మహారాష్ట్ర దిగ్గజ నేతలు యశ్వంతరావు చవాన్, శంకర్రావు చవాన్, వసంతదాదా పాటిల్, మనోహర్ జోషి, శరద్ పవార్ వంటివారు పూర్తి కాలం సీఎం పదవిలో కొనసాగలేకపోయారు.
- మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పనిచేసిన బ్రాహ్మణ వర్గానికి చెందిన రెండో నేతగా ఫడణవీస్ రికార్డు సాధించారు. ఆయన కన్నా ముందు బ్రాహ్మణ వర్గానికి చెందిన మనోహర్ జోషి మహారాష్ట్రకు సీఎంగా పనిచేశారు.
- మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఏకైక ఉప ముఖ్యమంత్రి కూడా ఫడణవీసే.
- మహారాష్ట్రకు అతిపిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రెండో వ్యక్తిగా నిలిచారు ఫడణవీస్. 44 ఏళ్ల వయసులో 2014లో సీఎం బాధ్యతలు చేపట్టారు. మహారాష్ట్రలో అతిపిన్న వయసులో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన రికార్డు శరద్ పవార్ పేరిట ఉంది.
- దేశంలో మూడో అతి తక్కువ కాలం సీఎంగా పనిచేసిన రికార్డును బీజేపీ నేత యడియూరప్పతో కలిసి దేవేంద్ర ఫడణవీస్ పంచుకున్నారు. 2019 నవంబర్ లో సీఎంగా ప్రమాణం చేసిన ఫడణవీస్ మూడు రోజుల్లోనే పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది.
పట్టువీడిన శిందే? డిప్యూటీ పోస్ట్‌కు ఓకే! 'మహా' సీఎంగా ఫడణవీస్!!
చక్రవ్యూహాన్ని ఛేదించిన ఫడణవీస్- మహారాష్ట్ర తదుపరి సీఎం ఆయనేనా?