Kumbh Mela 2025 Uttar Pradesh Economy Boost :ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తారు. లక్షల మంది ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమ ప్రాంతానికి తరలివస్తున్నారు. అయితే 45 రోజుల పాటు జరిగే మహాకుంభమేళా ఉత్తర్‌ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు రూ.2 లక్షల కోట్ల సంపదను సమకూర్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 40 కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనాతో ప్రయాగ్‌రాజ్‌లో 4వేల హెక్టార్లలో ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రూ.7వేల కోట్లు ఖర్చు చేసింది.
ఒక్కొక్కరు రూ.5000 ఖర్చుపెట్టినా!
40కోట్ల మంది భక్తుల్లో ఒక్కొక్కరు రూ.5వేల ఖర్చు చేస్తే ఉత్తర్‌ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు 2 లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒక్కో భక్తుడి సగటు ఖర్చు 10వేలకు కూడా చేరే అవకాశం ఉందని చెప్పారు. తద్వారా రూ.4 లక్షల కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. మహాకుంభమేళా వల్ల ఉత్తర్‌ప్రదేశ్ స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్-GSDP) 1 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.
మహా కుంభ మేళా (Associated Press) ప్రయాగ్‌రాజ్‌లో 2019లో జరిగిన అర్ధకుంభమేళా ద్వారా ఉత్తర్‌ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు రూ.1.20 లక్షల కోట్లు సమకూరాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ఇటీవల తెలిపారు. 40 కోట్ల మంది భక్తులు వస్తారనే అంచనా ఉండటంతో ఈసారి రూ.2 లక్షల కోట్లు సమకూరే అవకాశం ఉందని చెప్పారు. 2019లో జరిగిన అర్ధకుంభమేళాలో 24 కోట్ల మంది భక్తులు పాల్గొన్నారు.
మహాకుంభ్ 2025 ప్రయాగ్రాజ్ (Associated Press) అటు వ్యాపారుల సమాఖ్య-కాన్ఫిడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్-CAIT కూడా అంచనాలు రూపొందించింది. హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, తాత్కాలిక లాడ్జీల ద్వారా రూ.40వేల కోట్ల వ్యాపారం జరగనుందని అంచనా వేసింది. ఆహారం, పానియాల రంగం రూ.20వేల కోట్లను సమకూర్చే అవకాశం ఉందని తెలిపింది. పూజా సామగ్రి సహా ఆధ్యాత్మిక పుస్తకాల ద్వారా రూ.20వేల కోట్ల లావాదేవీలు జరగనున్నాయని పేర్కొంది. రవాణా, లాజిస్టిక్స్ సేవలు ద్వారా రూ.10వేల కోట్లు, టూరిస్ట్ గైడ్‌లు, ట్రావెల్ ప్యాకేజీల ద్వారా మరో రూ.10వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. తాత్కాలిక వైద్య శిబిరాలు, ఆయుర్వేద ఉత్పత్తులు, ఔషధాల ద్వారా మరో రూ.3వేల కోట్లు, ప్రకటనలు, ప్రమోషన్ కార్యకలాపాల ద్వారా రూ.10 వేల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని CAIT అంచనా వేసింది.
మహా కుంభ మేళాలో ఇసుకవేస్తే రాలనంత జనం (Associated Press)