Rahul Gandhi Sambhal Visit: ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల అల్లర్లు జరిగిన సంభల్‌లో బాధితులను పరామర్శించేందుకు బయల్దేరిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఆ బృందంలో ఎంపీ ప్రియాంకా గాంధీతోపాటు యూపీకి చెందిన మరో ఐదుగురు ఎంపీలు ఉన్నారు. స్థానికేతరుల ప్రవేశంపై ఆంక్షలున్న నేపథ్యంలో ఘాజీపుర్ సరిహద్దు వద్ద కాంగ్రెస్ ఎంపీల వాహనాలను యూపీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాహుల్ సారథ్యంలోని కాంగ్రెస్ బృందం ఘాజిపుర్ నుంచి దిల్లీకి వెనుదిరిగింది.
అంతకుముందు, తానొక్కడిని అయినా వెళ్లేందుకు సిద్ధమని, అయినా కూడా పోలీసులు అనుమతించడం లేదని రాహుల్ ఆరోపించారు. సంభల్‌లో ఏం జరిగిందో చూడటానికి వెళ్లాలని అనుకున్నట్లు చెప్పారు. బాధితులను కలవాలని వెళ్తుండగా తన రాజ్యాంగ హక్కును కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని అంతం చేసే ఘటనలు కొనసాగుతున్నాయని విమర్శించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు తమ పోరాటం ఆగదని తేల్చిచెప్పారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా సంభల్ వెళ్లేందుకు తనకు రాజ్యాంగపరమైన హక్కు ఉందన్నారు రాహుల్ గాంధీ.
కట్టుదిట్టమైన భద్రత
రాహుల్ బృందం పర్యటన నేపథ్యంలో ఈ ఉదయం నుంచే దిల్లీ సరిహద్దుల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘాజీపుర్ సరిహద్దు వద్ద భారీగా బలగాలను మోహరించారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు వాహనాల్లో అక్కడికి చేరుకోగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ స్తంభించింది.