Loksabha Polls Controversial BJP MPs Missed Seats :త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోన్న బీజేపీ, ప్రత్యర్థులకు తమ అభ్యర్థులపై విమర్శలు గుప్పించే అవకాశం కల్పించకుండా జాగ్రత్త పడుతోంది. దీనికోసం అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన, స్థానికంగా వ్యతిరేకత ఉన్న నాయకులకు టెకిట్ నిరాకరిస్తోంది. ఈక్రమంలో నేతల సీనియారిటీ కూడా లెక్కచేయడం లేదు. ఇక ఈ జాబితాలో తాజాగా కర్ణాటక బీజేపీ నాయకుడు అనంతకుమార్ హెగ్డే కూడా చేరారు.
ఆరు పర్యాయాలు ఎంపీ అయినా!
అనంతకుమార్ హెగ్డే, ఉత్తర కన్నడ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా ఎన్నికవుతున్నారు. 28 ఏళ్లలో ఆరు సార్లు గెలిచారు. అందులో నాలుగు సార్లు వరుసగా విజయం సాధించారు. అలాంటి సీనియర్ నేత నోటి దురుసుతనమే ఆయన సీటుకు చేటు తెచ్చినట్లు తెలుస్తోంది. రాజ్యాంగాన్ని మార్చాలంటే బీజేపీ 400 స్థానాల్లో గెలవాల్సి ఉంటుందని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో హెగ్డే వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని బీజేపీ కూడా ప్రకటించింది. ఈనేపథ్యంలోనే తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర కన్నడ నుంచి అనంతకుమార్‌ను తప్పించి మాజీ స్పీకర్ విశ్వేశ్వర హెగ్డేకు కమల దళం అవకాశం కల్పించింది.
ఫైర్‌బ్రాండ్‌గా పేరొందినా!
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకుర్ కూడా హెగ్డే తరహా పరిస్థితినే ఎదుర్కొన్నారు. బీజేపీ విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాలో ఆమెకు చోటు దక్కలేదు. ఫైర్‌బ్రాండ్‌గా పేరున్నా గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణం కావొచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గాడ్సేను దేశభక్తుడని ఆమె అభివర్ణించడం గతంలో వివాదాస్పదమైంది. ఈవిషయంపై ఇటీవల ప్రజ్ఞా ఠాకుర్ స్పందించారు. తనను క్షమించలేనని ప్రధాని మోదీ గతంలోనే చెప్పారని తెలిపారు. తాను చేసిన కొన్ని వ్యాఖ్యలు ఆయనను ఇబ్బందికి గురిచేశాయని చెప్పారు.