Lok Sabha Polls Women Candidates :సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రెండు విడతల పోలింగ్ ముగిసింది. వీటిలో పోటీ చేసిన మహిళా అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండటం పట్ల రాజకీయ విశ్లేషకులు, సామాజిక కార్యకర్తల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పార్టీలు మహిళలకు ముందస్తుగా టిక్కెట్లు ఇవ్వడానికి బదులుగా మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు కోసం ఎందుకు ఎదురు చూస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు.
రెండు విడతల్లో మొత్తం 2,823 మంది అభ్యర్థులు
లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పూర్తయిన రెండు విడతల్లో మొత్తం 2,823 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఏప్రిల్ 19న 102 స్థానాల్లో జరిగిన తొలి విడతలో 1,625 మంది అభ్యర్థులు పోటీపడగా వారిలో 135 మంది మాత్రమే మహిళలు ఉన్నారు. ఏప్రిల్ 26న జరిగిన రెండో విడత పోలింగ్‌లో 1,198 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో 100 మంది మాత్రమే మహిళా అభ్యర్థులు ఉన్నారు.
కేవలం 8 శాతమే
మొత్తం అభ్యర్థుల్లో మహిళలు కేవలం 8 శాతం మాత్రమే. తొలివిడత పోరులోని 135 మంది మహిళా అభ్యర్థుల్లో తమిళనాడు నుంచే అత్యధికంగా 76 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అయితే తమిళనాడులో పోటీకి దిగిన అభ్యర్థుల్లో వారు 8 శాతం మాత్రమేనని తెలుస్తోంది. రెండో విడత పోలింగ్‌లో కేరళలో అత్యధికంగా 24 మంది మహిళా అభ్యర్థులు పోటీపడ్డారు.
ఓటర్లలో దాదాపు సగం మంది మహిళలే
రాజకీయ పార్టీలు మహిళల అభ్యర్థిత్వాలను ప్రోత్సహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని దిల్లీ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుశీలా రామస్వామి పేర్కొన్నారు. పార్టీలు మరింత చురుగ్గా వ్యవహరించి ఎక్కువ మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టాలని ఆమె పేర్కొన్నారు. భారత్‌లోని ఓటర్లలో దాదాపు సగం మంది మహిళలు ఉన్నా పోటీ చేసే అభ్యర్థుల్లో వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం వారికున్న అడ్డంకుల్ని లేవనెత్తుతుందని అలీగడ్ ముస్లిం విశ్వవిద్యాలయం-AMU అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఇఫ్తేకర్ అహ్మద్ అన్సారీ అన్నారు.