Loksabha Election Key Contestants : దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రముఖులు పోటీ చేసిన పలు నియోజకవర్గాల ఫలితాలపై ఆసక్తి నెలకొంది. కొన్నిచోట్ల వార్ వన్‌సైడ్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుండగా, మరికొన్నిచోట్ల తీవ్రమైన పోటీ నెలకొందని అంటున్నారు. గత రెండు పర్యాయలుగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో బంపర్ మెజారిటీతో గెలిచిన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి హ్యాట్రిక్‌పై కన్నేశారు. వారణాసిలో మోదీ విజయం నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అటు బీజేపీ శ్రేణులు సైతం మోదీకి ఎంత మెజారిటీ వస్తోందో అని లెక్కలేసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ప్రధానికి అనుకూలంగా రావడం వల్ల మరింత జోష్ మీద ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ తరఫున అజయ్ రాయ్ నిలిచారు.
రాహుల్ రెండు చోట్ల గెలుస్తారా?
గత ఎన్నికల్లో రెండుచోట్ల పోటీ చేస్తే ఒకచోట గెలిచిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఈసారి కూడా రెండు స్థానాల్లో పోటీ చేశారు. 2019లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని తమ కంచుకోట అమేఠీలో కంగుతిన్న రాహుల్, ఈసారి మరో కంచుకోటైన రాయ్‌బరేలీ నుంచి తొలిసారి పోటీ చేశారు. ఇక్కడ రాహుల్ గెలుపుపై కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. బీజేపీ తరఫున దినేశ్ ప్రతాప్ సింగ్ నిలిచారు. గత ఎన్నికల్లో గెలిచిన కేరళలోని వయనాడ్ స్థానం నుంచి కూడా మరోసారి రాహుల్ పోటీ చేశారు. ఇక్కడ సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా సతీమణి అన్నీ రాజా, బీజేపీ తరఫున ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కే సురేంద్రన్ రాహుల్‌కు ప్రత్యర్థులుగా ఉన్నారు.
గాంధీలు లేకుండా అమేఠీ పోరు
గుజరాత్‌లోని గాంధీనగర్ నుంచి గత ఎన్నికల్లో దాదాపు 5 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన బీజేపీ అగ్రనేత అమిత్ షా, మరోసారి గెలుపుపై ధీమాతో ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టిన కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మరోసారి అమేఠీలో గెలుపు తథ్యమంటున్నారు. పాతికేళ్లలో తొలిసారి నెహ్రూ, గాంధీ కుటుంబ సభ్యులు లేకుండా అమేఠీ ఎన్నికలు జరగడం వల్ల అందరి ఆసక్తి దీనిపై పడింది. కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ జరిగింది. బీజేపీ తరఫున కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ నిలవగా, కాంగ్రెస్ తరఫున ఐరాస మాజీ దౌత్యవేత్త శశిథరూర్ పోటీచేశారు. బంగాల్‌లోని బహరంపుర్ ఫలితాలపై కూడా ఆసక్తి నెలకొంది. అధికార టీఎంసీ తరఫున మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్ పోటీ చేయగా, కాంగ్రెస్ తరఫున ఆ రాష్ట్ర అగ్రనేత అధీర్ రంజన్ చౌదరీ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
అన్నామలై గెలుస్తారా?
బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై బరిలో నిలిచిన కోయంబత్తూరు ఫలితాలపై అందరి దృష్టి నెలకొంది. అసలు తమకు పట్టులేని తమిళనాడులో బీజేపీకి కొంత ఆదరణ లభించిందంటే అది అన్నామలై కష్టమేనని చెప్పాలి. ఇక విరుధ్‌నగర్‌లో బీజేపీ తరఫున నిలిచిన సినీ నటి రాధికకు పోటీగా దివగంత నటుడు విజయకాంత్ కుమారుడు విజయ ప్రభాకర్ డీఎండీకే తరఫున గట్టి పోటీనిచ్చారు. బీజేపీ తరఫున తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పోటీ చేసిన చెన్నై దక్షిణ నియోజకవర్గం, DMK తరఫున కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ బరిలో ఉన్న చెన్నై సెంట్రల్ స్థానం, DMK తరఫున మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళి పోటీ చేసిన తూత్తుకుడి స్థానాల ఫలితాలపై ఆసక్తి నెలకొంది.
హాసన్‌పై ప్రత్యేక దృష్టి
కర్ణాటకలో సంచలనం సృష్టించిన హాసన్ సెక్స్ కుంభకోణంలో అరెస్టై ప్రస్తుతం కస్టడీలో ఉన్న మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేసిన హాసన్ నియోజకవర్గ ఫలితాలపై ప్రత్యేక దృష్టి పడింది. మండ్య నుంచి జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, మైసూర్ నుంచి బరిలో నిలిచిన మైసూర్ రాజవంశానికి చెందిన యదువీర్ వడియార్ ఆ ఎన్నికల్లో ఎంతమేర విజయం సాధిస్తారో చూడాలి. మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై హవేరీ నుంచి బరిలో నిలిచారు. మరో మాజీ సీఎం జగదీశ్ షెట్టార్ బెల్గాం తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.