తెలంగాణ

telangana

ETV Bharat / bharat

58 స్థానాలు, 889 మంది అభ్యర్థులు- ఆరో విడత పోలింగ్​కు అంతా రెడీ - lok sabha election 2024 - LOK SABHA ELECTION 2024

Lok Sabha Polls Phase 6 polling : సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. గురువారంతో ఎన్నికల ప్రచారం ముగియగా, శనివారం 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలను పంపింది. 58 స్థానాల్లో 889 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

Lok Sabha Polls Phase 6 polling
Lok Sabha Polls Phase 6 polling` (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : May 24, 2024, 3:12 PM IST

Lok Sabha Election Phase 6 Polling : లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. శనివారం (మే 25) జరగనున్న పోలింగ్​ కోసం కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎన్నికలకు కావాల్సిన ఈవీఎంలు, ఇతర సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు పంపింది. ఆరో విడతలో 6 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ విడతలోనే హరియాణాలోని 10, దిల్లీలోని 7 సీట్లకూ ఎన్నిక జరగనుంది. జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్-రాజౌరీ లోక్‌సభ స్థానానికి మూడో విడతలో భాగంగా మే 7న పోలింగ్‌ జరగాల్సి ఉండగా, కనెక్టివిటీకి సంబంధించిన లాజిస్టికల్, కమ్యూనికేషన్ వంటి అడ్డంకులు తలెత్తాయి. దీంతో మే 25న ఆరో విడతలో ఆ స్థానానికి పోలింగ్ నిర్వహించనున్నారు.

లోక్​సభ బరిలో మాజీ సీఎం ఖట్టర్​
ఆరో దశ పోరులో హరియాణాలో అంబాలా, కురుక్షేత్ర, సిర్సా, హిసార్, కర్నాల్, సోనిపట్, రోహ్తక్, భివానీ-మహేంద్రగఢ్, గురుగ్రామ్, ఫరీదాబాద్‌లో పోలింగ్ జరగనుంది. బీజేపీ మొత్తం 10 స్థానాల్లో పోటీ చేస్తోంది. కురుక్షేత్రను ఆమ్‌ ఆద్మీ పార్టీకి కేటాయించిన కాంగ్రెస్‌, మిగిలిన 9 స్థానాల్లో బరిలోకి దిగింది. ఈసారి కర్నాల్‌లో పోరు ఆసక్తి రేకెత్తిస్తోంది. 2014, 2019లలో ఇక్కడ బీజేపీనే విజయం సాధించింది. ఈసారి బీజేపీ తరఫున మాజీ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్ బరిలో ఉన్నారు. గురుగ్రామ్‌ లోక్‌సభ స్థానంలో సాఫ్ట్‌వేర్, నిర్మాణ రంగాలు కీలకంగా మారనున్నాయి. 2014, 2019లలో అక్కడ బీజేపీ గెలిచింది. హ్యాట్రిక్‌ కోసం మరోసారి రావ్‌ ఇందర్‌జీత్‌ సింగ్‌ రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌ తరఫున బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు రాజ్‌ బబ్బర్‌ బరిలో నిలిచారు. కురుక్షేత్ర లోక్‌సభ స్థానంలో ఈసారి బీజేపీ తరఫున నవీన్‌ జిందాల్ పోటీ చేస్తున్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి సుశీల్‌ గుప్తా, ఐఎన్‌ఎల్‌డీ అభ్యర్థిగా అభయ్‌ సింగ్‌ చౌటాలా బరిలో ఉన్నారు. రోహ్‌తక్‌లో కాంగ్రెస్ నుంచి దీపేంద్ర హూడా, బీజేపీ నుంచి అరవింద్ కుమార్ శర్మ పోటీలో ఉన్నారు.

దిల్లీలోని ఏడు స్థానాలకు పోలింగ్​
దిల్లీలోని ఏడు స్థానాలకూ ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది. న్యూ దిల్లీ పోరుపై ఈ దఫా ఆసక్తి నెలకొంది. ఆ స్థానంలో కేంద్ర మాజీ మంత్రి సుష్మ స్వరాజ్ కుమార్తె భన్సూరీ స్వరాజ్ పోటీ చేస్తున్నారు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో న్యూ దిల్లీ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ తరఫున మీనాక్షీ లేఖీ గెలిచారు. ఈశాన్య దిల్లీ స్థానంలో బీజేపీ గత రెండు ఎన్నికల్లో విజయం సాధించింది. హ్యాట్రిక్ సాధించాలని బీజేపీ నేత మనోజ్ తివారీ తహతహలాడుతున్నారు. కాంగ్రెస్ నుంచి దిల్లీ జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ బరిలో ఉన్నారు. వాయవ్య దిల్లీలో కాంగ్రెస్ నుంచి ఉదిత్ రాజ్, బీజేపీ నుంచి యోగేంద్ర చందోలియా పోటీ పడుతున్నారు. చాందినీ చౌక్‌లో బీజేపీ నుంచి ప్రవీణ్ ఖండేల్వాల్, కాంగ్రెస్ నుంచి జై ప్రకాష్ అగర్వాల్ మధ్య పోటీ నెలకొంది.

అనంతనాగ్​లో త్రిముఖ పోరు
జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్‌-రాజౌరీ లోక్‌సభ స్థానం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మాజీ సీఎం, పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ-PDP అధినాయకురాలు మెహబూబా ముఫ్తీ స్వయంగా బరిలో ఉన్నారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌-NC నుంచి మియా అల్తాఫ్, అప్నీ పార్టీ తరఫున జఫర్‌ ఇక్బాల్‌ మన్హాస్‌ రంగంలోకి దిగడం వల్ల త్రిముఖ పోరు కనిపిస్తోంది.

బిహార్​లో గెలిచేదవరు?
బిహార్‌లో వాల్మీకి నగర్, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, షెయోహర్, వైశాలి, గోపాల్‌గంజ్ , సివాన్, మహారాజ్‌గంజ్‌లలో ఆరో విడతలో పోలింగ్ జరగనుంది. వాల్మీకీ నగర్‌లో 2019 సార్వత్రిక, 2020 ఉప ఎన్నికల్లో జేడీయూ గెలిచింది. సిట్టింగ్ ఎంపీ సునిల్ కుమార్ మరోసారి ఇదే స్థానంలో బరిలో ఉన్నారు. ఆర్జేడీ నుంచి దీపక్ యాదవ్ పోటీలో ఉన్నారు. పశ్చిమ చంపారన్‌లో బీజేపీ నుంచి సంజయ్ జైయస్​వాల్, కాంగ్రెస్ నుంచి బరిలో దిగిన మోహన్ తివారీ మధ్య పోటీ నెలకొంది.

బీజేపీ వర్సెస్​ బీజేడీ
ఆరో విడతలో ఒడిశాలోని భువనేశ్వర్, పురీ, ధెంకనల్, కియోంజర్, కటక్, సంబల్​పుర్‌ లోక్‌సభ స్థానాలతో పాటు 42 అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరగనుంది. చాలా స్థానాల్లో బీజేపీ, బీజేడీ మధ్యే పోటీ నెలకొంది. సంబల్‌పుర్ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బరిలో ఉన్నారు. ఆయనకు BJD నేత ప్రణబ్ ప్రకాశ్ దాస్ పోటీ ఇస్తున్నారు. పురీ స్థానంలో గత రెండు ఎన్నికల్లో BJD గెలిచింది. ఈ సారి సిట్టింగ్ ఎంపీ కాకుండా అరుప్ పట్నాయక్‌కు ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. బీజేపీ నుంచి సంబిత్ పాత్ర బరిలో ఉన్నారు.

బరిలో మేనకా గాంధీ
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ దఫా 14 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. సుల్తాన్‌పుర్‌లో సిటింగ్ ఎంపీ బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ , సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రాంభువల్ నిషాద్ మధ్య పోరు జరుగుతోంది. అలహాబాద్‌లో కాంగ్రెస్‌కు చెందిన ఉజ్వల్ రేవతి రమణ్ సింగ్ , బీజేపీ అభ్యర్థి నీరజ్ త్రిపాఠి మధ్య పోటీ నెలకొంది. బంగాల్‌లో ఈ విడతలో 8 చోట్ల పోలింగ్ జరగనుంది. పలు చోట్ల బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. ఝార్ఖండ్‌లో రాంచీ, జంషెద్‌పూర్‌, గిరిదీ, ధన్‌బాద్ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. రాంచీలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ద్విముఖ పోరు కనిపిస్తోంది. జంషెద్‌పుర్‌లో జేఎంఎం, బీజేపీ మధ్య పోటీ నెలకొంది.

సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకు 428 స్థానాలకు పోలింగ్ ముగిసింది. శనివారం 58 చోట్ల ఎన్నిక జరగనుంది. చివరిదైన ఏడో విడత జూన్ 1న జరగనుండగా, జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉండనుంది.

'నేను బతికున్నంతకాలం ఎస్​సీ, ఎస్​టీ రిజర్వేషన్లను ఎవరూ లాక్కోలేరు- ఇది మోదీ గ్యారెంటీ' - lok sabha election 2024

లోక్‌సభ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు 10% లోపే- బరిలో కేవలం 797 మందే! - Lok Sabha Elections 2024

ABOUT THE AUTHOR

...view details