తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ముగిసిన సార్వత్రిక సమరం- ప్రశాంతంగా ఏడో దశ పోలింగ్ పూర్తి - Lok Sabha Elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Lok Sabha Election Phase 7 Polling : దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. 44 రోజులపాటు సుదీర్ఘంగా సాగిన ఓటింగ్‌ ప్రక్రియలో దేశ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏప్రిల్‌ 19నుంచి జూన్‌ ఒకటో తేదీ వరకు ఏడు దశల్లో ఎన్నికల సంఘం సుదీర్ఘంగా పోలింగ్‌ను నిర్వహించింది. చెదురుముదురు హింసాత్మక ఘటనల నడుమ శనివారం ఏడో దశ పోలింగ్‌ కూడా జరిగింది. బంగాల్​లో ప్రధాన పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈవీఎంను నదిలో విసిరేయడం కలకలం రేపింది. ప్రధాని మోదీ సహా దిగ్గజ నేతలు బరిలో నిలిచిన స్థానాల్లో ఏడోదశలో ఓటింగ్‌ జరిగింది. మధ్యాహ్నం 5 గంటల వరకు 58.34 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.

Lok Sabha Election Phase 7 Polling
Lok Sabha Election Phase 7 Polling (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jun 1, 2024, 6:00 PM IST

Lok Sabha Election Phase 7 Polling : సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన ఏడో విడత పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. దీంతో 44 రోజులపాటు సుదీర్ఘంగా సాగిన సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. చివరి విడత పోలింగ్‌లో ఏడు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతం పరిధిలోని 57నియోజకవర్గాల్లో ఓటర్లు తమ హక్కు వినియోగించుకున్నారు. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని 13 లోక్‌సభ స్థానాలతో పాటు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో 4 లోక్‌సభ స్థానాలతో పాటు ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నిక జరిగింది. పంజాబ్‌ 13, బంగాల్ 9, బిహార్‌ 8, ఝార్ఖండ్‌ 3 లోక్‌సభ స్థానాలకు, ఒడిశాలోని 6 లోక్‌సభ, 42అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. ప్రధాని మోదీ, అనురాగ్‌ ఠాకూర్‌, కంగనా రనౌత్‌ సహా పలువురు ప్రముఖులు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లోనూ ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.

ఓటు వేసిన ప్రముఖులు
ఏడో విడత పోలింగ్‌లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. భక్తియార్‌పూర్‌లో బిహార్‌ సీఎం నీతీశ్‌ కుమార్‌, హమిర్‌పుర్‌లో హిమాచల్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌, సంగ్రూర్‌లో పంజాబ్‌ సీఎం భగవంత్‌మాన్‌, బిలాస్‌పూర్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా ఓటు వేశారు. మండిలో కంగనారనౌత్‌, హమీర్‌పూర్‌లో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాగూర్‌, గోరఖ్‌పూర్‌లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, నటుడు రవికిషన్‌ ఓటు వేశారు. అమృత్‌సర్‌లో బీజేపీ నేత తరణ్‌జిత్‌ సింగ్‌, లఖ్‌నవూలో ఆప్‌నేత రాఘవ్‌ చద్దా, జలంధర్‌లో క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆర్జేడీ చీఫ్‌ లాలూప్రసాద్‌ యాదవ్‌ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తేజస్వి యాదవ్‌ పట్నాలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రానికి వీల్‌ఛైర్‌లో వెళ్లి ఓటు వేశారు. ఆయన కాలికి గాయమైనట్లు కనిపిస్తోంది. టీఎంసీ ఎంపీ, నటీ నుస్రత్‌ జహాన్‌ కోల్‌కతాలో ఓటు వేశారు. పంజాబ్‌లోని మొహాలీ పోలింగ్‌ కేంద్రం వద్ద కొందరు యువతులు గిద్దా నృత్యాన్ని ప్రదర్శిస్తూ ఓటు ప్రాముఖ్యతను వివరించారు. అందరూ ఓటు వేయాలని నృత్యం ద్వారా అభ్యర్థించారు.

బంగాల్​లో ఉద్రిక్త పరిస్థితులు
ఏడో విడతలోనూ బంగాల్‌లో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయం ఆరున్నర సమయంలో 24 పరగణా జిల్లాలోని ఓ పోలింగ్‌బూత్‌లో మూక దాడి జరిగింది. కుల్తాలీ గ్రామంలో రిజర్వులో ఉంచిన ఈవీఎంలు, 2వీవీపాట్లు, సెక్టార్‌ ఆఫీసర్‌ పత్రాలను ఎత్తుకెళ్లి సమీపంలోని ఓ చెరువులో పడేశారు. పోలింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో స్థానికులకు, పోలింగ్‌ ఏజెంట్లకు మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు బలవంతంగా పోలింగ్ స్టేషన్‌లోకి ప్రవేశించి ఈవీఎంను బయటకు తీసుకెళ్లి చెరువులో పడేశారు. ఆ పోలింగ్‌ కేంద్రంలో అదనపు ఈవీఎంలు తరలించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సెక్టార్ ఆఫీసర్ పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల వారు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మేరిగంజ్‌లోని 2 పోలింగ్ కేంద్రాల వద్ద బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు పరస్పరం దాడి చేసుకోగా పలువురికి గాయాలయ్యాయి. జాదవ్‌పూర్‌లో ఐఎస్​ఎఫ్, సీపీఎం మద్దతుదారుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగి ఐఎస్​ఎఫ్ కార్యకర్తలు గాయపడ్డారు. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం బాంబులు విసురుకున్నారని పోలీసులు తెలిపారు. గుంపును చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారు. భంగర్‌తో పాటు దక్షిణ 24 పరగణా జిల్లాలోని ఇత్‌ఖొలాలో రాళ్లదాడులు జరిగాయి. సందేశ్‌ఖాలీలో అత్యాచార నిందితుడు టీఎంసీ నేత షేక్‌షాజహాన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. మహిళలు వెదురు కర్రలు, రాళ్లతో రోడ్లపైకి వచ్చి నిరసించారు. జయనగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు గుంపులుగా చేరి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు.

ఐదు నియోజకవర్గాలపై ఆసక్తి
అయితే, ఏడోవిడత ఎన్నికల బరిలో వివిధ పార్టీల తరఫున 904మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం ఐదు నియోజకవర్గాలపై ఆసక్తి నెలకొంది. ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి, బోజ్‌పురీ నటుడు రవికిషన్‌ నిల్చున్న గోరఖ్‌పుర్, బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌ కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ బరిలో ఉన్న మండి, హమీర్‌పుర్‌ స్థానాలకు ఈ విడతలో పోలింగ్‌ జరిగింది. సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ పోటీలో ఉన్న డైమండ్‌ హార్బర్‌ లోక్‌సభ స్థానానికి పోలింగ్‌ ముగిసింది. ఈ స్థానాల్లో ఎవరిని తమ నేతగా ఎన్నుకోవాలన్న విషయంపై ఓటర్లు తమ నిర్ణయాన్ని ఓట్ల రూపంలో నిక్షిప్తం చేశారు.

పోలింగ్ శాతాలు
సార్వత్రిక ఎన్నికల తొలి ఆరు దశల్లో వరుసగా 66.14 శాతం, 66.71 శాతం, 65.68 శాతం, 69.16 శాతం, 62.2 శాతం, 63.36 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, జూన్‌ 2న సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. జూన్‌ 4న లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

సల్మాన్​ ఖాన్​పై​ బిష్ణోయ్‌ 'ట్రిగర్‌'- నిత్యం 15-20మందితో రెక్కీ! పాక్‌ నుంచి ఏకే-47, హై క్యాలిబర్​ రైఫిల్స్! - Salman Khan Threat Lawrence Bishnoi

పుణె కారు రేష్ డ్రైవింగ్​ కేసులో బాలుడి తల్లి అరెస్టు- బ్లడ్ శాంపిల్​ను మార్చినందుకే - pune porsche case

ABOUT THE AUTHOR

...view details