Lok Sabha Election Phase 5 Polling :లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఐదోవిడత పోలింగ్ ముగిసింది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. ఈ విడతలో ఉత్తరప్రదేశ్‌లోని 14 స్థానాలు, మహారాష్ట్ర 13, బంగాల్ 7, బిహార్, ఒడిశాలో 5చొప్పున, ఝార్ఖండ్ 3, జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లో ఒక్కో నియోజకవర్గంలో ఓటింగ్ జరిగింది. జమ్ముకశ్మీర్‌లో ప్రజలు తెల్లవారుజాము నుంచే ఓటింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉండటం వల్ల సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ఠ భద్రత మధ్య పోలింగ్ నిర్వహించారు. బారాముల్లా పార్లమెంటరీ నియోజకవర్గలో ఎన్‌సీ అభ్యర్థి, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా, పీడీపీ అభ్యర్థి మీర్ మహ్మద్ ఫయాజ్, జేకేపీసీ అభ్యర్థి సజాద్ లోన్‌ల మధ్య పోటీ నెలకొంది.
ఓటేసేందుకు సినీనటులు క్యూ
అమేఠీ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న కేంద్రమంత్రి స్మృతి ఇరానీ గౌరీగంజ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిందే, శివసేన నేతలు ఉద్ధవ్‌ఠాక్రే, వ్యాపారవేత్తలు రతన్ టాటా, ముకేష్ అంబానీ, అనిల్ అంబానీ తదితరులు కుటుంబాలతో కలిసి ఓటు వేశారు. RBI గవర్నర్ శక్తికాంత్ దాస్, హాకీ ఇండియా చీఫ్ దిలీప్ టిర్కీ ఓటు వేశారు. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, కుమారుడితో కలిసి, అజింక్య రహానే భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నటులు అమితాబ్ బచ్చన్, జాన్వీ కపూర్, దర్శకుడు జోయా అక్తర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, జాకీ బాగ్నానీ, సంజయ్ దత్, మనోజ్ బాజ్‌పేయ్, అనిల్ కపూర్, హేమా మాలిని తదితరులు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకుని, ఓటు ఆవశ్యకతను వివరించారు. నాసిక్‌లో స్వతంత్ర అభ్యర్థి శాంతిగిరి మహారాజ్ పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన తర్వాత ఓటింగ్ యంత్రానికి పూలమాల వేశారు.