Lok Sabha Election 2024 Voters : రానున్న లోకసభ ఎన్నికలకు భారత్ సిద్ధమవుతోంది. అధికార యంత్రాంగం ఈ ఎన్నికల పనిలో నిమగ్నం కానుంది. ఇప్పటికే రాజకీయ పార్టీలూ ప్రచార వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు దేశంలో 96 కోట్ల మందికిపైగా ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం(ఈసీ) గణాంకాలు చెబుతున్నాయి. వారిలో 47 కోట్ల మంది మహిళలేనని చెప్పింది. దేశవ్యాప్తంగా 12 లక్షలకుపైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఈసీ తెలిపింది.
1.5 కోట్ల మంది సిబ్బంది
దేశవ్యాప్తంగా ఓటు వేసేందుకు అర్హులైన వారిలో దాదాపు 1.73 కోట్ల మంది 18 నుంచి 19 ఏళ్లలోపువారే ఉన్నారని ఎన్నికల సంఘం పేర్కొంది. పార్లమెంటు ఎన్నికలను నిర్వహణ కోసం 1.5 కోట్ల మంది సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపింది. రాజకీయ పార్టీలకు ఎన్నికల సంఘం గతేడాది పంపిన ఓ లేఖ ప్రకారం చూస్తే, దేశంలో 1951లో 17.32 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉంటే 2019 ఎన్నికలకు వచ్చే సరికి ఈ సంఖ్య 91.20 కోట్లకు చేరింది. తొలి లోక్‌సభ ఎన్నికల్లో 45 శాతం పోలింగ్ నమోదైంది. గత లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్ 67 శాతంగా ఉంది.