Lok Sabha Election 2024 Expenditure : దేశంలో ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు గత రికార్డులను బద్దలుకొట్టి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలవనున్నాయి. ఈసారి ఎన్నికల వ్యయం రూ. లక్షా 35 వేల కోట్లకు చేరనుంది. ఇది 2019 ఎన్నికల వ్యయం రూ.60వేల కోట్లతో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ కానుందని సెంటర్ ఫర్ మీడియా సర్వీసెస్-CMS ఛైర్మన్ ఎన్.భాస్కరరావు అంచనా వేశారు. 35ఏళ్ల నుంచి ఆయన ఎన్నికల వ్యయాన్ని అంచనా చేస్తున్నారు. రూ.లక్షా 35 వేల కోట్ల వ్యయంలో రాజకీయ పార్టీలు, సంస్థలు, అభ్యర్థులు, ప్రభుత్వం, ఎన్నికల సంఘం ప్రత్యక్షంగా, పరోక్షంగా చేసే ఖర్చులన్నీ కలిసి ఉంటాయని CMS ఛైర్మన్ తెలిపారు. ప్రధాని మోదీ సారథ్యంలో మూడోసారి అధికారం చేపట్టాలని ఎన్డీఏ భావిస్తుండగా ప్రచారవ్యయంలో భారతీయ జనతా పార్టీది పైచేయిగా కనిపిస్తోంది.
ఎలక్టోరల్ బాండ్లతో ధన ప్రవాహం
18వ లోక్‌సభ ఎన్నికల వ్యయాన్ని తొలుత రూ.లక్షా 20వేల కోట్లుగా అంచనా వేసిన CMS ఛైర్మన్ ఎన్.భాస్కరరావు, ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం బయటపడటం, అన్ని వ్యయాలను లెక్కించిన తర్వాత రూ. లక్షా 35 వేల కోట్లుగా సవరించినట్లు చెప్పారు. పోలింగ్ తేదీల ప్రకటనకు మూడు-నాలుగు నెలలముందు వేసిన అంచనాలను ఈ సవరణ కవర్ చేసింది. ఎలక్టోరల్ బాండ్లు కాకుండా వేర్వేరు మార్గాల ద్వారా ఎన్నికల ప్రక్రియలోకి ధన ప్రవాహం కొనసాగినట్లు చెప్పారు. దేశంలో రాజకీయ విరాళాలకు సంబంధించి పారదర్శకత లేదని ఇదివరకే ADR తెలిపింది. 2004-05 నుంచి 2022-23 వరకు దేశంలోని 6ప్రధాన రాజకీయ పార్టీలకు రూ.19వేల 83 కోట్లు విరాళాలు అందగా అందులో 60 శాతం నిధులు ఎన్నికల బాండ్లు సహా గుప్తమార్గాల నుంచి అందినట్లు ADR అంచనా వేసింది.