తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రథయాత్రికుడిగా అడ్వాణీ- 6యాత్రలతో దేశరాజకీయ చరిత్రలో సువర్ణాధ్యాయం! - LK Advani Yatras latest news

LK Advani Yatras : భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో లాల్‌ కృష్ణ అడ్వాణీని భిన్నంగా చూపేది ఆయన వ్యక్తిత్వమే. ఉక్కు మనిషిగా పార్టీ ఉన్నతి కోసం అహర్నిశలు శ్రమించిన అడ్వాణీ రథయాత్రికుడిగా కార్యకర్తల మన్ననలు అందుకున్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం తొలిసారి రథాన్ని కదలించిన బీజేపీ అగ్రనేత, ఆ తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో వివిధ పేర్లతో రథయాత్ర చేశారు. దేశ రాజకీయ చరిత్రలో తనదైన అధ్యాయాన్ని లిఖించారు.

LK Advani Yatras
LK Advani Yatras

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 1:23 PM IST

LK Advani Yatras : భారతీయ జనతా పార్టీ దిగ్గజనేత లాల్ కృష్ణ అడ్వాణీ తన జీవన పయనంలో ఆరు రకాల రాజకీయ యాత్రలను నిర్వహించారు. వాటిలో అత్యంత ప్రాముఖ్యం సంపాదించిన యాత్ర 1990లో నిర్వహించిన సోమనాథ్‌- అయోధ్య రామ రథయాత్ర. 1990 సెప్టెంబరు 25న దీన్ దయాల్‌ ఉపాధ్యాయ జన్మదినం సందర్భంగా గుజరాత్‌లో ప్రారంభించారు. 10 వేల కిలోమీటర్ల యాత్ర చేసి అక్టోబరు 30న అయోధ్య చేరుకోవాలనేది ఎల్​కే అడ్వాణీ ప్రణాళికలు వేసుకున్నారు. అయోధ్యలో రామజన్మభూమి ఆందోళనకు మద్దతు తెలుపుతూ అడ్వాణీ ఈ యాత్రను చేపట్టారు. బీజేపీ నేత ప్రమోద మహాజన్ మినీబస్‌ను రథం రూపంలో డిజైన్ చేయించగా ఆ రథంలోనే అడ్వాణీ యాత్రను కొనసాగించారు.

అయోధ్య చేరకుండానే యాత్ర!
రోజుకు దాదాపు 300 కిలోమీటర్ల మేర అడ్వాణీ రథయాత్ర దేశంలోని వివిధ గ్రామాల మీదుగా సాగింది. ఈ క్రమంలో హిందూ, ముస్లింల మధ్య ఉత్తర భారతదేశంలో గొడవలు జరగడం వల్ల అడ్వాణీపై నాటి వీపీ సింగ్‌ ప్రభుత్వం విమర్శలు గుప్పించింది. అక్టోబరు 23న బిహార్‌లోని సమిష్టిపుర్‌లో అడ్వాణీని నాటి బిహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ అరెస్ట్ చేయించారు. ఫలితంగా అయోధ్య చేరకుండానే యాత్ర నిలిచిపోయింది. ఉత్తర్‌ ప్రదేశ్‌లో 15 వేల మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. తదనంతర పరిణామాల్లో బాబ్రీ మసీదు ఘటన జరగడం వల్ల అడ్వాణీని కూడా అరెస్ట్‌చేశారు. కానీ అడ్వాణీ రామ రథ యాత్రకు ప్రజలు నీరాజనం పట్టారు. ఆయనకు దేశంలో విశేష ప్రజాదరణ దక్కింది. ఫలితంగా 1989లో 86గా ఉన్న బీజేపీ ఎంపీల సంఖ్య రథయాత్ర తర్వాత 1991లో జరిగిన ఎన్నికల్లో 120కి పెరిగింది.

4 అంచెల్లో జనాదేశ్ యాత్ర
80వ రాజ్యాంగ సవరణ బిల్లు, ప్రజాప్రాతినిథ్య చట్ట సవరణ బిల్లులను వ్యతిరేకిస్తూ 1993 సెప్టెంబరు 11న అడ్వాణీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ జనాదేశ్ యాత్రను దేశ వ్యాప్తంగా నిర్వహించింది. 4 అంచెల్లో జనాదేశ్ యాత్రను నిర్వహించారు. మైసూర్ నుంచి అడ్వాణీ, జమ్ము నుంచి భైరాన్ సింగ్ షెకావత్‌, పోర్‌ బందర్‌ నుంచి మురళీ మనోహర్ జోషి, కోల్‌కతా నుంచి కల్యాణ్ సింగ్ ఈ యాత్రను నిర్వహించారు. 14 రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల మీదుగా 1993 సెప్టెంబరు 25న భోపాల్ చేరుకున్న నాలుగు యాత్రలు భారీ ప్రదర్శనగా ముగిశాయి. ఆ రెండు బిల్లులకు పార్లమెంటులో ఆమోదం లభించకపోవడం వల్ల జనాదేశ్ యాత్ర లక్ష్యం నెరవేరింది.

భారతీయ జనతా పార్టీ స్వర్ణ జయంతి రథ యాత్ర
స్వాతంత్ర్యం సముపార్జించి 50ఏళ్లు అయిన సందర్భంగా భరతమాత స్వేచ్ఛ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరులు, స్వాతంత్ర్య సమరయోధులకు నీరాజనం పట్టేందుకు 1997మే 18న భారతీయ జనతా పార్టీ స్వర్ణ జయంతి రథ యాత్రను నిర్వహించింది. స్వతంత్ర్య సంగ్రామంలో కీలక ఘటనలు, ఉద్యమాలు జరిగిన చారిత్రక ప్రదేశాలమీదుగా ఈ యాత్ర సాగింది. 1997 మే 15 నుంచి 1997 జులై 15 వరకూ 4 దశల్లో 59 రోజులు స్వర్ణ జయంతి రథ యాత్ర నిర్వహించారు. 21రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 15 వేల కిలో మీటర్ల మేర స్వర్ణ జయంతి రథయాత్రను అడ్వాణీ నేతృత్వంలో బీజేపీ నాయకులు నిర్వహించారు.

భారత్ ఉదయ్ యాత్ర
1997 నుంచి 2004 వరకూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు మార్చి, ఏప్రిల్ నెలల్లో భారత్‌ వెలిగిపోతోందనే అర్థం వచ్చే "భారత్ ఉదయ్ యాత్ర"ను నిర్వహించింది. ఐదు నెలల ముందే ప్రజాతీర్పు కోరుతూ 2004 మార్చి10న తమిళనాడులోని కన్యాకుమారిలో చేపట్టిన భారత్ ఉదయ్ యాత్ర మార్చి 25 నాటికి పంజాబ్‌లోని అమృత్‌సర్‌ చేరుకుంది. ఐదు రోజుల విరామం తర్వాత రాజ్‌కోట్‌ నుంచి తిరిగి ప్రారంభమై ఏప్రిల్‌ 14 నాటికి పూరీకి చేరుకుంది. అయితే ఆ ఎన్నికల్లో NDA సర్కార్‌ ఓటమి పాలుకాగా కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి విజయం సాధించింది.

భారత్‌ సురక్షా యాత్ర
తీవ్రవాదుల నియంత్రించడంలో కాంగ్రెస్ నేతృత్వంలోని UPA సర్కార్‌ విఫలమైందని ఆరోపిస్తూ 2006 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ భారత్‌ సురక్షా యాత్రను చేపట్టింది. ఈ సురక్షా యాత్రను రెండు దశలుగా నిర్వహించారు. లాల్ కృష్ణ అడ్వాణీ గుజరాత్‌లోని ద్వారక నుంచి దిల్లీకి, నాటి బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌ సింగ్‌ ఒడిశాలోని పూరీ నుంచి దిల్లీకి యాత్రను నిర్వహించారు .6వేల కిలోమీటర్ల మేర అడ్వాణీ యాత్రను నిర్వహించగా రాజ్‌నాథ్‌ 5 వేల 500 కిలోమీటర్లు నిర్వహించారు. మొత్తం 17 రాష్ట్రాల మీదుగా 11 వేల 500 కిలోమీటర్ల మేర భారత్ సురక్షా యాత్ర జరిగింది.

జన్ చేతన యాత్ర
విదేశాల్లో ఉన్న నల్లధనం వెనక్కి తేవాలని, దేశంలో సుపరి పాలన రావాలనే నినాదంతో 2011 అక్టోబరు 11న బిహార్‌లోని శరణ్ జిల్లాలోని సితాబ్‌ డయారా గ్రామం నుంచి బీజేపీ అగ్రనేత అడ్వాణీ జన్ చేతన యాత్రను నిర్వహించారు. 7600 కిలోమీటర్లు సాగిన ఈ అవినీతి వ్యతిరేక యాత్ర నవంబరు 20న దిల్లీలో ముగిసింది. ఈ యాత్రలో భాగంగా అప్పుటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అడ్వాణీ, యూపీ, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, గుజరాత్‌లలో 14 రోజులు పాటు గడిపారు.

కరడుగట్టిన దేశ భక్తుడు- అడ్వాణీ ఎప్పటికీ భారతరత్నమే!

బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వాణీకి భారతరత్న- శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ABOUT THE AUTHOR

...view details