LK Advani Biography : ఎల్‌కే అడ్వాణీగా సుపరిచితులైన అడ్వాణీ అసలు పేరు లాల్ కృష్ణ అడ్వాణీ. సింధీ హిందూ కుటుంబానికి చెందిన KDఅడ్వాణీ, గ్యానీదేవి దంపతులకు 1927 నవంబరు 8న నాటి అఖండ భారత్, నేటి పాకిస్థాన్‌లోని కరాచీలో జన్మించారు. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించిన అడ్వాణీ, నేటి పాకిస్థాన్‌లోని హైదరాబాద్‌లో డీజీ నేషనల్ కాలేజీలో న్యాయవిద‌్యను అభ్యసించారు. ముంబయిలోని గవర్నర్ లా కాలేజీలోనూ చదువుకున్నారు. చిన్నప్పుడే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)లో చేరిన అడ్వాణీ, 1947లో కరాచీ విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు. సంఘ్ కార్యకర్తగా భారతదేశంపై మమకారంతో ఆయన కుటుంబంతో సహా 1947 సెప్టెంబరు 12న భారత్‌కు వచ్చి స్థిరపడ్డారు.
RSS పత్రికలో జర్నలిస్టుగా
1965 ఫిబ్రవరి 25న అడ్వాణీ, కమలను వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. సంఘ్ సభ్యుడిగా దేశ విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి వలస వచ్చినవారికి సేవ చేయడం కోసం ఎక్కువకాలం రాజస్థాన్‌లో అడ్వాణీ గడిపేశారు. అనంతరం శ్యామా ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జన్ సంఘ్‌లో చేరారు. 1957లో వాజ్‌పేయీ సహా జన్‌సంఘ్ ఎంపీలకు సహాయ కారిగా ఉండేందుకు RSS, దిల్లీకి రమ్మని పిలవడం వల్ల అడ్వాణీ హస్తినలో అడుగు పెట్టారు. 1960లో RSS సిద్ధాంతాలతో నడిచిన ఆర్గనైజర్ పత్రికలో జర్నలిస్టుగా చేరిన అడ్వాణీ, నేత్ర అనే కలం పేరుతో సినిమా వ్యాసాలను కూడా రాసేవారు.
గాంధీనగర్ నుంచి ఏడుసార్లు లోక్‌సభకు
భారతీయ జన సంఘ్‌లో చేరినప్పటికీ, క్రియాశీల రాజకీయాల్లో చేరేందుకు అడ్వాణీకి కొంత సమయం పట్టింది. వాజ్‌పేయీ సహకారంతో 1966లో దిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికలలో జన సంఘ్ తరపున ఎన్నికైన అడ్వాణీ, మరుసటి సంవత్సరమే దిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ అధ్యక్షుడయ్యారు. 1970-72 మధ్య భారతీయ జనసంఘ్ దిల్లీ విభాగం అధ్యక్షుడిగా ఎన్నికైన అడ్వాణీ, 1970లో రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి దేశ ప్రజాస్వామ్య సౌధం పార్లమెంటులో అడుగు పెట్టారు. 1973 నుంచి 76 వరకు జన్‌సంఘ్ అధ్యక్షుడిగా పనిచేసిన అడ్వాణీ, 1974 నుంచి 76 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 4 సార్లు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించిన అడ్వాణీ, గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానం వరసగా ఏడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు.
కేంద్ర మంత్రిగా తొలిసారి బాధ్యతలు
1975 జనవరి 25న నాటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించి RSSపై నిషేధం విధించారు. అదే సమయంలో వాజ్‌పేయీతో కలిసి బెంగళూరులో ఉన్న అడ్వాణీ అరెస్టయ్యారు. 1976 జనవరి18న ఎన్నికల ప్రకటన వెలువడడం వల్ల జైలు నుంచి విడుదలైన అడ్వాణీ, జయప్రకాశ్ నారాయణ స్థాపించిన జనతా పార్టీలో 1977 నుంచి 80 వరకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ ఘన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయగా, అడ్వాణీ సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1977 నుంచి 79 వరకు ఆ పదవిలో పనిచేశారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో జనతా పార్టీ ప్రభుత్వం కుప్పకూలింది.