LK Advani Bharat Ratna : బీజేపీ కురువృద్ధుడు, కమలం పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అడ్వాణీకి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో గౌరవించింది. ఈ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వెల్లడించారు. దేశాభివృద్ధిలో అడ్వాణీ పాత్ర కీలకమని కొనియాడారు. అడ్వాణీకి భారతరత్న వరించడం తనకు ఉద్వేగభరితమైన క్షణమని తెలిపారు. దేశ హోం మంత్రిగా, సమాచార, ప్రసార మంత్రిగా సేవలందించారని తెలిపారు.
"శ్రీ ఎల్‌కే అడ్వాణీ జీకి భారతరత్న అందించబోయే విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఆయనతో మాట్లాడి ఈ గౌరవం పొందినందుకు అభినందించాను. అత్యంత గౌరవనీయులైన రాజనీతిజ్ఞుల్లో అడ్వాణీ ఒకరు. భారతదేశ అభివృద్ధికి ఆయన చేసిన కృషి స్మారకమైనది. అట్టడుగు స్థాయిలో నుంచి మొదలైన ఆయన జీవితం దేశ ఉప ప్రధానిగా సేవ చేయడం వరకు సాగింది. దేశ హోం మంత్రిగా, సమాచార, ప్రసార మంత్రిగా సేవలందించారు."
-- ప్రధాని మోదీ ట్వీట్
'పార్లమెంటరీ ప్రసంగాలు ఆదర్శప్రాయమైనవి'
"ఆయన పార్లమెంటరీ ప్రసంగాలు ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమైనవి. ప్రజా జీవితంలో అడ్వాణీ సుదీర్ఘంగా పారదర్శకత, సమగ్రతతో సేవలందించారు. జాతీయ ఐక్యత, సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని పెంపొందించడానికి ఆయన అసమానమైన కృషి చేశారు. ఆయనకు భారతరత్న అందించడం చాలా ఉద్వేగభరితమైన క్షణం. ఆయనతో సంభాషించడానికి, నేర్చుకోవడానికి నాకు లెక్కలేన్ని అవకాశాలు లభించడం అదృష్టంగా భావిస్తున్నా" అని మోదీ ట్వీట్ చేశారు.
అడ్వాణీ స్పందన ఇలా!
భారతరత్న అవార్డు తనకు దక్కిన గౌరవం మాత్రమే కాదని, జీవితాంతం ఉత్తమంగా సేవ చేసేందుకు కృషి చేసిన ఆదర్శాలు, సిద్ధాంతాలకు కూడా దక్కిన అవార్డు అని ఎల్‌కే అడ్వాణీ పేర్కొన్నారు. అత్యంత వినయంతోపాటు కృతజ్ఞతతో తాను ఈ పురస్కారాన్ని అంగీకరిస్తున్నానట్లు చెప్పారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. "నేను 14 సంవత్సరాల వయసులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో వాలంటీర్‌గా చేరినప్పటి నుంచి నాకు అప్పగించిన ఏ పనినైనా అంకితభావంతో నిస్వార్థంగా చేశాను. ఈ జీవితం నాది కాదు. నా జీవితమంతా దేశం కోసమే. ఈ సమయంలో ఇప్పటికే భారతరత్న అవార్డులు పొందిన పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ , భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీని స్మరించుకుంటున్నాను. ప్రజా జీవితంలో నాతో కలిసి పనిచేసిన లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు, స్వయంసేవకులు, ఇతరులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యావాదాలు" అని తెలిపారు అడ్వాణీ.
అభిమానులకు అభివాదం
కేంద్రం భారతరత్న అవార్డు ప్రకటించిన తర్వాత అడ్వాణీ తొలిసారి బయటకొచ్చారు. దిల్లీలోని ఆయన నివాసం వద్ద అభిమానులకు అభివాదం చేశారు. అడ్వాణీ వెంట ఆయన కూతురు ప్రతిభ ఉన్నారు. అడ్వాణీకి ప్రతిభ మిఠాయి తినిపించారు. తమ నాన్నకు దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించినందుకు మొత్తం కుటుంబం సంతోషంగా ఉందని ప్రతిభా అడ్వాణీ పేర్కొన్నారు. అడ్వాణీ జీవితమంతా దేశ సేవకే అంకితం చేశారని తెలిపారు. ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు.