తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా' కూటముల మధ్య హోరాహోరీ పోరు- ఎన్నికల్లో విన్నర్​ను డిసైడ్ చేసేది ఈ 6 అంశాలే! - MAHARASHTRA ELECTIONS KEY FACTORS

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండు కూటముల మధ్య హోరాహోరీ పోరు- గెలుపు ఓటములను నిర్ణయించేది ఈ 6 అంశాలే!

Key Factors Decide Winner In Maharashtra Elections
Key Factors Decide Winner In Maharashtra Elections (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Nov 18, 2024, 9:04 AM IST

Key Factors Decide Winner In Maharashtra Elections :పోలింగ్ ముంగింట మహారాష్ట్రలో ప్రచారం పతాక స్థాయికి చేరింది. అయితే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎప్పుడు ప్రత్యర్థుల మధ్య హోరాహోరీ పోరు నెలకొంటుంది. దాదాపు మూడో వంతు స్థానాల్లో మెజారిటీ మార్జిన్లు తక్కువగానే ఉంటాయి. ఇవే గెలుపుఓటములు నిర్దేశిస్తాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితి నెలకొంది. కానీ ఈసారి, ఇంతవరకు కలిసి ఉన్న మిత్రులే శత్రువులుగా, శత్రువులే మిత్రులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దీంతో మహారాష్ట్ర ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీల మధ్య అసహజ మిత్రుత్వం కొనసాగుతున్న వేళ మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రధానంగా 6 అంశాలు ప్రభావం చూపిస్తున్నాయి.

1. మాఝీ లడ్కీ బెహన్‌ యోజన
ఈసారి మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి(ఎన్​డీఏ) కూటమి ప్రవేశపెట్టిన మాఝీ లడ్కీ బెహన్‌ యోజన ప్రభావం చూపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ఓటమి మూటగట్టుకున్న ఈ కూటమి- అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ సంక్షేమ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తారు. రాష్ట్రంలో 2.34 కోట్ల మంది మహిళలకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది. తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఈ పథకం కింద ఇచ్చే మొత్తాన్ని రూ.2,100కు పెంచుతామని మహాయుతి హామీ ఇచ్చింది. ఇదిలా ఉండగా, ధరల పెరుగుదల మహాయుతిపై ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తోంది. ప్రభుత్వం ఇచ్చే రూ.1,500 ఏమాత్రం సరిపోవని అభిప్రాయపడుతున్నారు.

2. రూరల్​, అర్బన్ విభజన
మహారాష్ట్రలో 6 జోన్లు ఉన్నాయి. ఇందులో విదర్భ, మరాఠ్వాడా, ఉత్తర మహారాష్ట్ర ఆర్థికంగా వెనుకబడ్డాయి. ఇక మిగిలిన ముంబయి, ఠాణె-కొంకణ్, పశ్చిమ మహారాష్ట్ర ఆర్థికంగా మెరుగ్గా ఉన్నాయి. కాగా, దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలోనే రైతులు ఆత్యహత్యలు చేసుకుంటున్నారు. మరోవైపు దేశ జీడీపీకి అత్యధికంగా వాటాను అందిస్తున్న రాష్ట్రమూ ఇదే.

నీటి కొరత, పంటలకు కనీస మద్దతు ధరలు లేకపోవడం, ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా ఈ ప్రాంతాల్లో మహాయుతిపై కొంత వ్యతిరేకత ఉంది. అది ఈ లోక్‌సభ ఎన్నికల్లో కనిపించింది. ఇక ముంబయి, పశ్చిమ మహారాష్ట్రల్లో రెండు కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఠాణె-కొంకణ్‌ ప్రాంతంలో మహాయుతిదే పైచేయిగా కనిపిస్తోంది.

3. ఓట్ ట్రాన్స్​ఫర్
ఎన్నికల్లో ఏ కూటమైనా విజయం సాధించాలంటే మిత్రపక్ష పార్టీల మధ్య ఓట్ల బదిలీ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే రాజకీయాల్లో రెండు రెండు కలిస్తే నాలుగు కావు. అది మూడైనా, ఐదైనా కావొచ్చు. అలాంటి పరిస్థితే ఇప్పుడు మహారాష్ట్రలో నెలకొంది. మహా వికాస్ అఘాడీ, మహాయుతి కూటముల్లోనూ అసహజ మిత్రులు ఉన్నారు. దీంతో పార్టీల మధ్య 100 శాతం ఓట్ల బదిలీ అనేది ఎండమావి లాగే కనిపిస్తోంది.

లోక్‌సభ ఎన్నికల్లో మహా వికాస్‌ అఘాడీలో (ఎమ్​వీఏ) ఓట్ల బదిలీ బాగానే జరిగింది. కాంగ్రెస్, ఎన్​సీపీ (ఎస్​పీ), శివసేన (ఉద్ధవ్‌) పార్టీల మధ్య సరైన అవగాహనే కొనసాగింది.

4. మరాఠా vs ఓబీసీ
ఈసారి మహా ఎన్నికల్లో మరాఠా అంశం కీలక పాత్ర పోషించనుంది. మరాఠ్వాడా ప్రాంతంలో మరాఠా కోటా ఉద్యమం మహాయుతి కూటమి అవకాశాలను భారీగా దెబ్బతీసింది. లోక్‌సభ ఎన్నికల్లో కూడా పరాజయం పాలైంది. ఓబీసీలకు కోపం వస్తుందనే ఆందోళనతో కోటా ఆందోళనలను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. దీంతో 50శాతం ఓబీసీలు ఆ కూటమికి అండగా నిలిచారు. అయితే ఈ ఎన్నికల్లో మరాఠాలు ఆ కూటమికి వ్యతిరేకంగా ఓటేసే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

5. ఇండిపెండెంట్లు, రెబల్స్‌
మహారాష్ట్ర రాజకీయాల్లో చిన్న చిన్న పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయి. వాటితోపాటు స్వతంత్ర అభ్యర్థులు గెలుపుఓటములపై ప్రభావం చూపుతారు. ఇక రెబల్స్‌ ప్రభావం ఎలాగూ కాదనలేని అంశం. ప్రస్తుతం పీడబ్ల్యూపీ, సమాజ్‌వాదీ, రాష్ట్రీయ సమాజ్‌ పక్ష, జన్‌ సురాజ్య శక్తి, ఆర్‌పీఐ, బహుజన్‌ వికాస్‌ అఘాడీ, వంచిత్‌ బహుజన్‌ అఘాడీ, మజ్లిస్‌ తదితర పార్టీలు కొన్ని ప్రాంతాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. గత 5 ఎన్నికల్లో ప్రధాన పార్టీలు కాకుండా ఇతరులు సగటున 30 సీట్ల వరకూ గెలుస్తున్నారు. 25శాతం వరకు ఓట్లు సాధిస్తున్నారు. ఈసారి సగం స్థానాల్లో రెండు కూటములకు కూడా రెబల్స్‌ బెడద ఉంది.

6. మరాఠాలు, గుజరాతీలు!
వలస వచ్చిన ఓటర్లే మహారాష్ట్రలో 8శాతం దాకా ఉన్నారు. ఉత్తర్​ప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ నుంచి వచ్చిన వారే ఇందులో అధికంగా ఉంటారు. ముంబయిలో వలస వచ్చిన వారి జనాభా 43శాతం. ఈ నగరంలో మహారాష్ట్రీయులు 42శాతం ఉంటారు. 19శాతం వరకు గుజరాతీలుంటారు. ఉద్ధవ్‌తోపాటు శరద్‌ పవార్‌ కూడా మరాఠా ఆత్మగౌరవ అంశాన్ని తెరపైకి తెచ్చారు. మరాఠా పార్టీలను బీజేపీ చీల్చి అధికారం చేపట్టిందని వారు ఆరోపిస్తున్నారు. కొన్ని కంపెనీలను గుజరాత్‌కు తరలించడాన్ని వారు తప్పుబడుతున్నారు. ఇది మరాఠా, గుజరాతీల మధ్య పోరాటంగా మారింది. మరాఠాలు ఎమ్​వీఏకు అండగా ఉంది.గుజరాతీలు, ఉత్తర భారతీయులు మహాయుతికి సపోర్ట్​ చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details