తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్నికల తొలి విడతలో 8 మంది కేంద్ర మంత్రులు- ఆ VIPల భవితవ్యమేంటో? - Lok Sabha elections 2024 - LOK SABHA ELECTIONS 2024

Key Contestants In Pahse 1 : తొలివిడతలో పలువురు ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నితిన్‌ గడ్కరీ సహా 8 మంది కేంద్రమంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఒక మాజీ గవర్నర్‌ ఈ విడత బరిలో నిలిచారు. మరికొన్ని స్థానాలు పార్టీలతోపాటు ప్రముఖ నేతలకు కూడా ప్రతిష్టాత్మకంగా మారాయి. వాటి వివరాలను ఈ కథనంలో చూద్దాం.

Key Contestants In Pahse 1
Key Contestants In Pahse 1

By ETV Bharat Telugu Team

Published : Apr 18, 2024, 6:35 PM IST

Key Contestants In Pahse 1 :తొలి విడత పోలింగ్‌లో తమిళనాడుపై అందరి దృష్టి నెలకొంది. ఈ సారి ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో నిలిచారు. ఇటీవల దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు నుంచి పోటీ చేస్తున్నారు. సీనియర్‌ నటి రాధిక బీజేపీ తరఫున విరుధ్‌నగర్‌ బరిలో నిలిచారు. ఆమె ప్రత్యర్థిగా DMDK వ్యవస్థాపక అధ్యక్షుడు, నటుడు విజయకాంత్‌ కుమారుడు విజయ ప్రభాకర్‌ పోటీ చేస్తున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ చెన్నై దక్షిణ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు.

చెన్నై సెంట్రల్‌ స్థానం నుంచి DMK తరఫున కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ పోటీలో ఉన్నారు. మాజీ సీఎం కరుణానిధి కుమార్తె కనిమొళి తూత్తుకుడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బిహార్‌లోని జమూయ్ నియోజకవర్గం నుంచి LJP వ్యవస్థాపక అధ్యక్షుడు రామ్‌విలాస్‌ పాసవాన్‌ కుమారుడు చిరాగ్‌ పాసవాన్‌ పోటీలో నిలిచారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా నుంచి మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ కుమారుడు నకుల్‌నాథ్ మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫీలీబీత్‌లో వరుణ్‌ గాంధీకి టికెట్ నిరాకరించిన బీజేపీ ఆయన స్థానంలో కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాదకు అవకాశం కల్పించింది.

తొలి దశ లోక్​సభ ఎన్నికల్లో కీలక అభ్యర్థులు

తొలి దశలో తేలనున్న 8మంది కేంద్ర మంత్రులు భవితవ్యం
తొలివిడతలో 8 మంది కేంద్ర మంత్రులు తమ పనితీరుపై ఓటరు తీర్పు కోరుతున్నారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ హ్యాట్రిక్‌ కొట్టడమే లక్ష్యంగా మరోసారి నాగ్‌పుర్‌ బరిలో నిలిచారు. మరో మంత్రి కిరణ్‌ రిజిజు అరుణాచల్‌ ప్రదేశ్‌ పశ్చిమ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 2004 నుంచి ఆయన ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రిజిజుకు పోటీగా మాజీ సీఎం., కాంగ్రెస్‌ అరుణాచల్‌ప్రదేశ్ అధ్యక్షుడు నబం టుకీ ఎన్నికల బరిలో నిలిచారు. మరో కేంద్ర మంత్రి, మాజీ సీఎం సర్బానంద సోనోవాల్ దిబ్రుగఢ్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

కేంద్ర మంత్రి సంజీవ్ బలియాన్ ముజఫర్‌ నగర్‌ బరిలో నిలిచారు. మరో మంత్రి జితేంద్ర సింగ్ ఉధమ్‌పూర్‌ నుంచి హ్యాట్రిక్‌ కొట్టాలని యత్నిస్తున్నారు. కేంద్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడు అయిన భూపేంద్ర యాదవ్ రాజస్థాన్‌లోని అల్వార్‌ నుంచి పోటీ చేస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ బికనీర్‌ బరిలో నిలిచారు. మరో మంత్రి ఎల్.మురుగన్ తమిళనాడులోని నీలగిరి నుంచి పోటీ చేస్తుండగా ఆయనకు ప్రత్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా నిలిచారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిసిత్‌ ప్రామాణిక్‌ బంగాల్‌లోని కూచ్‌బిహార్‌ నుంచి పోటీ చేస్తున్నారు. వీరందరి భవితవ్యం జూన్ 4న తేలనుంది.

కమల్​నాథ్​ గురి తప్పుతుందా?
తొలి విడత పోలింగ్‌లో కొన్ని నియోజకవర్గాలు పార్టీలకు, నేతలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. వాటిలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌, ముజఫర్‌నగర్‌, మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా, మహారాష్ట్రలోని చంద్రపుర్‌ ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లో అందరి దృష్టి కేంద్రీకృతమైన నియోజకవర్గం ఛింద్వాడా. కాంగ్రెస్‌ దిగ్గజ నేత, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ తన కుమారుడు నకుల్‌నాథ్‌ను ఇక్కడ రెండోసారి బరిలోకి దింపారు. గత ఎన్నికల్లో ఆయన గెలిచారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోయిన సీటు ఇదొక్కటే. లోక్‌సభ ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి దాదాపు 5వేల మంది కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు బీజేపీలో చేరిన నేపథ్యంలో కమల్‌నాథ్‌ ఒంటరి పోరాటం చేస్తున్నారు.

తొలి దశ లోక్​సభ ఎన్నికల్లో కీలక అభ్యర్థులు

రసవత్తర పోరుకు ఛింద్వాడా రెడీ
మరోవైపు బీజేపీలోని కీలక నేతలందరూ ఈ నియోజకవర్గంలో తమ అభ్యర్థి వివేక్‌ బంటీ సాహు తరఫున విస్తృత ప్రచారం చేశారు. గత 44 ఏళ్లలో బీజేపీ ఒక్కసారే ఛింద్వాడాలో గెలవడం వల్ల మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గంలో ఇటీవల 6సార్లు ప్రచారం చేశారు. ఆయన స్థానిక, స్థానికేతర నినాదాన్ని లేవనెత్తారు. సాహు స్థానికుడని, కమల్‌నాథ్‌ కుటుంబం స్థానికేతరులని ప్రచారం చేశారు. ఇటు సానుభూతిపై కమల్‌నాథ్‌ ఆధారపడుతున్నారు. తన హయాంలో చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఛింద్వాడాలోని ఏడు సీట్లనూ కాంగ్రెస్‌ గెలుచుకుంది. కమల్‌నాథ్‌ ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలిచారు. గత లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన ఆయన కుమారుడు నకుల్‌నాథ్ వరుసగా రెండోసారి గెలవాలని చూస్తున్నారు.

సానుభూతితో ఒకరు- అభివృద్ధి మంత్రంతో మరొకరు
గత ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 సీట్లలో కాంగ్రెస్‌ గెలిచిన ఒకే ఒక్క సీటు చంద్రపుర్‌. ఐతే ఈసారి కాంగ్రెస్‌ గెలవడం అంత సులభంగా లేదు. చంద్రపుర్‌ను దక్కించుకోవడానికి బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇక్కడ కాంగ్రెస్‌ తరఫున ప్రతిభ ధనోర్కర్‌, బీజేపీ తరఫున రాష్ట్ర మంత్రి సుధీర్‌ ముంగంటీవార్‌ పోటీ చేస్తున్నారు. గత ఏడాది మే నెలలో సిటింగ్‌ ఎంపీ సురేశ్‌ ధనోర్కర్‌ మరణించడం వల్ల అప్పటి నుంచి ఈ సీటు ఖాళీగా ఉంది. ఆయన భార్యకే కాంగ్రెస్‌ టికెటిచ్చింది. సానుభూతిపై ప్రతిభ ఆధారపడగా రాజకీయ ఉద్ధండుడిగా పేరున్న ముంగంటీవార్‌ అభివృద్ధిని ప్రచారాస్త్రంగా మలుచుకున్నారు. 2019 కంటే ముందు రెండుసార్లు ఈ సీటును గెలుచుకున్న బీజేపీ ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది. మహారాష్ట్రలో ప్రధాని మోదీ ప్రచారాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. అయితే శివసేన, ఎన్సీపీ చీలిక వర్గాలు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం పట్ల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. చంద్రపుర్‌ జిల్లాలో ప్రస్తుతం మద్య నిషేధం అమల్లో ఉన్నప్పటికీ అక్రమ మద్యం వ్యాపారం బాగా విస్తరించింది. ఇది బీజేపీకి వ్యతిరేకంగా మారింది.

యూపీలో నవాబ్​ల కంచుకోట బద్దలయ్యేనా?
ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాంపుర్‌ తొలిసారిగా ఆజంఖాన్‌ లేకుండా ఎన్నికలకు వెళ్తోంది. గత ఐదు దశాబ్దాల్లో ఆయన లేకపోవడం ఇదే తొలిసారి. ఈ సమాజ్‌వాదీ పార్టీ నేత ప్రస్తుతం జైల్లో ఉన్నారు. చారిత్రకంగా, సాంస్కృతికంగా ప్రాముఖ్యమున్న రాంపుర్‌లో నవాబ్‌లదే ఆధిపత్యం. 1978 నుంచి 2022 వరకూ ఆజంఖాన్‌ కుటుంబానికే ఇక్కడి ప్రజలు పట్టం కట్టారు. ఈసారి రాంపుర్‌లో పెద్దగా ఎన్నికల వాతావరణం లేదని స్థానికులు తెలిపారు. ఇక్కడ సమాజ్‌వాదీ పార్టీ ఇమాం మొహిబుల్లా నద్వీని రంగంలోకి దించగా ఆజంఖాన్‌ మద్దతుదారులు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం ఇక్కడ సమస్యలు కావని, ఎప్పటిలాగే భావోద్వేగాలే ప్రభావం చూపుతున్నాయని స్థానికులు తెలిపారు. బీజేపీ తరఫున ఘన్‌శ్యామ్‌ సింగ్‌ లోధీ పోటీ చేస్తున్నారు. ఆయన సిటింగ్‌ ఎంపీ. బీఎస్పీ నుంచి జీషన్‌ ఖాన్‌ పోటీ చేస్తున్నారు. మరోవైపు ముజఫర్‌నగర్‌లో నియోజకవర్గంలో మత సామరస్యం, ధరలు, శాంతి భద్రతలే ప్రధాన సమస్యలు. కొంత మంది వ్యాపారులు జీఎస్టీ వేధింపులను సమస్యగా పేర్కొంటున్నారు. ముజఫర్‌నగర్‌లో రోడ్లు బాగాలేవు. పేదలకు కనీస సౌకర్యాలు లేవు. చదువులు, ఉద్యోగాల కోసం పిల్లలు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.

ABOUT THE AUTHOR

...view details