Health Tips For Sabarimala Pilgrims:మండల-మకరవిళక్కు సీజనులో భాగంగా కేరళలోని శబరిమల ఆలయం తెరుచుకుంది. శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కేరళ ప్రభుత్వం, ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఆలయానికి చేరుకొనే అన్ని ప్రధాన మార్గాల్లో ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నట్లు కేరళ ఆరోగ్యశాఖ పేర్కొంది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానుండటం వల్ల పంబాలో పలు భాషలు మాట్లాడే వైద్యులు, వాలంటీర్లతో 24/7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. అంతేకాకుండా యాత్ర సమయంలో భక్తులు గుర్తుంచుకోవాల్సిన కొన్ని కీలక సూచనలు కూడా చేసింది.
శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్తున్నారా? భక్తులు ఈ హెల్త్ టిప్స్ పాటించాల్సిందే!
శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించే యాత్రికులకు కీలక ఆరోగ్య సూచనలు!
Sabarimala Pilgrims (ETV Bharat)
Published : 5 hours ago
ఆరోగ్య శాఖ చేసిన సూచనలు
- శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి చేరుకొనే సమయంలో యాత్రికులకు ఒంట్లో నలతగా అనిపిస్తే భక్తుల కోసం ఏర్పాటు చేసిన సమీపంలోని ఆరోగ్య కేంద్రం నుంచి వైద్య సాయం తీసుకోవడంలో ఏమాత్రం ఆలస్యం చేయొద్దు.
- రెగ్యులర్‌గా వాడే మందులను తీర్థయాత్ర సమయంలో కూడా తీసుకోవాలి. ఇప్పటికే యాత్రికులు ఏదైనా అనారోగ్యానికి సంబంధించి చికిత్స తీసుకుంటూ ఉంటే యాత్ర సమయంలోనూ సంబంధిత ఔషధాలు, ప్రిస్క్రిప్షన్‌లను మీ వెంట ఉంచుకోండి.
- అయ్యప్ప స్వామి ఆలయం వద్దకు ఒకేసారి నడిచి వెళ్లడం అసౌకర్యంగా ఉండవచ్చు. అందువల్ల తీర్థయాత్రకు వెళ్లడానికి ముందే నడక, కొన్ని వ్యాయామాలు ప్రాక్టీసు చేయడం మంచిది.
- ఒకవేళ ఫిట్‌నెస్ కలిగి ఉండకపోతే కొండపైకి వెళ్లేటప్పుడు నెమ్మదిగా ఎక్కాలి. అవసరమైన చోట ఆగి విశ్రాంతి తీసుకోవాలి. నీలిమల మార్గాన్ని కాకుండా స్వామి అయ్యప్పన్ రహదారిని ఎంచుకోవడం మంచిది. భోజనం చేసిన వెంటనే కొండపైకి ఎక్కడం చేయవద్దు.
- ఏదైనా వైద్య సాయం కావాలంటే 04735203232 నంబర్‌కు కాల్ చేయండి.
- నీలిమల, పంబ, అపచిమేడు, సన్నిధానం ఆస్పత్రుల్లో గుండె సంబంధిత వైద్య పరీక్షలు వంటి సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
- ఎవరైనా పాముకాటుకు గురైతే వెంటనే వైద్యులను సంప్రదించండి. శబరిమలలోని ఆరోగ్య కేంద్రాల్లో యాంటీవీనమ్, చికిత్సలు కూడా అందుబాటులో ఉన్నాయి.
- తీర్థయాత్ర సమయంలో గోరువెచ్చని నీటిని మాత్రమే తాగండి.
- ఆహారం తీసుకొనే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోండి. మూత ఉంచని ఆహారాన్ని తీసుకోవద్దు.
- బహిరంగ ప్రదేశాల్లో విసర్జన చేయొద్దు. టాయిలెట్లను ఉపయోగించండి. ఆ తర్వాత మీ చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కోండి.