TO LET Board Issue : సైబరాబాద్‌లో ఓ ఠాణా ఇన్స్పెక్టర్ ఇన్నాళ్లూ సగం అద్దె చెల్లిస్తూ ఓ ఇంట్లో ఉంటూ ఇటీవల ఖాళీ చేశాడు. వారం రోజుల తర్వాత వచ్చి యజమాని ఇంటికి టు-లెట్ బోర్డు పెట్టాడు. దీన్ని ప్రశ్నించిన మరో ప్లాటు యజమాని, ఆయన కుమారుడిని పచ్చి బూతులు తిడుతూ కేసులు పెడతానంటూ బెదిరించి, టు-లెట్ బోర్డును అలానే కొనసాగించాడు. భయబ్రాంతులకు గురైన బాధితులు సదరు ఇన్స్పెక్టర్పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇంతకీ అసలు కథ ఏంటంటే : ఎస్సై నుంచి ఇన్స్పెక్టర్గా పదోన్నతి పొంది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కీలక ప్రాంతంలో ఎస్‌హెచ్‌వోగా పోస్టింగ్ వచ్చింది. ఇదే సమయంలో ఆయన వద్దకు ఓ కేసు వచ్చింది. ఓ అపార్టుమెంటులోని 3 పడక గదులుండే ప్లాటును, యజమాని నిర్మాణ సంస్థ కార్యాలయానికి అద్దెకు ఇచ్చారు. కొన్ని నెలల తర్వాత అద్దె విషయంలో యజమానికి, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు మధ్య గొడవ జరిగి విషయం ఠాణా వరకు వెళ్లింది.
ఈ వ్యవహారం మొత్తాన్ని సదరు ఇన్స్పెక్టర్ దగ్గరుండి చూసుకున్నాడు. దీంతో నిర్మాణ సంస్థను ఖాళీ చేయించి, ఆ ప్లాటులో కుటుంబంతో సహా ఇన్స్పెక్టర్ అద్దెకు దిగాడు. ప్లాటు అద్దె రూ.40 వేలు కాగా, ఈయన మాత్రం సగమే చెల్లించి మిగిలిన సగం ఎగ్గొట్టేవాడు. ఈ విషయం ఈనాడు పేపర్లో కూడా ప్రచురితం అయింది. ఉన్నతాధికారుల దృష్టికెళ్లి స్పెషల్ బ్రాంచి విచారణ కూడా ఎదుర్కొన్నాడు. దీంతో ఇన్స్పెక్టర్ను బాలానగర్ జోన్ పరిధిలోని మరో స్టేషన్‌కు బదిలీ చేశారు.
ఒక్క రోజులో టు లెట్ బోర్డు ఏర్పాటు : అయినా డిసెంబరు మూడో వారం వరకూ ఇన్స్పెక్టర్ గతంలో పని చేసిన పోలీస్ స్టేషన్ పరిధిలోనే విధులు నిర్వహించాడు. డిసెంబర్ 23న ఖాళీ చేసి తాళం వాచ్‌మెన్‌కు ఇచ్చేశాడు. దీంతో అంతా ప్రశాంతంగా ముగిసిందనుకుంటే, ఆ మరుసటి రోజుకు మొత్తం రివర్స్ అయింది. ఇన్స్పెక్టర్ ఖాళీ చేసిన ప్లాటుకు ఓ వ్యక్తి వచ్చి టు-లెట్ బోర్డును ఏర్పాటు చేశాడు. ఇది గమనించిన వాచ్మెన్ ప్రశ్నిస్తే, ఖాళీ చేసిన ఇన్స్పెక్టర్ టు-లెట్ బోర్డు పెట్టమన్నారని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఇదిలా ఉండగా, మంగళవారం మధ్యాహ్నం మరో ప్లాటు యజమానికి ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి, 'నేను టు-లెట్ బోర్డు పెట్టించిన తర్వాత తాళాలు ఎందుకు తీసుకున్నావ్' అంటూ వారిపై పరుష పదజాలంతో మాట్లాడి భయభ్రాంతులకు గురి చేశాడు. ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చి యజమాని కుమారుడిని పచ్చిబూతులు తిట్టాడు. దీంతో బెదిరిపోయిన బాలుడు తండ్రికి కాల్ చేసి అంతా వీడియో తీశాడు. ఆ తర్వాత వీడియోలను ఇన్స్పెక్టర్ డిలీట్ చేశాడు.
ఉన్నతాధికారులు తెలుసంటూ : ఇతరుల ఇంటికి టు-లెట్ బోర్డు పెట్టి దౌర్జన్యానికి దిగిన సదరు ఇన్స్పెక్టర్ తనకు ఉన్నతాధికారి అండదండలు ఉన్నాయంటూ అందరికీ చెబుతాడని సమాచారం. తాను చెప్పిందే రాజ్యమని, తోటి ఇన్స్పెక్టర్లలతో చెబుతాడని తెలిసింది. అయితే గతంలో ఓ ఠాణాకు ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఓ ఎస్సై రూ.30 వేల లంచం కేసులో ఏసీబీకి దొరకగా, ఇన్స్పెక్టర్ వెంట్రుక వాసిలో తప్పించుకున్నట్లు సమాచారం.