Kejriwal Rule From Jail : జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నవారు కేవలం రెండు రకాల పత్రాలపైనే సంతకాలు చేయగలరని, అవి రాజకీయ స్వభావం కలిగి ఉండకూదని జైళ్ల శాఖ పేర్కొంది. తిహాడ్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్‌కు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని, నేరస్థుడి కంటే దారుణంగా చూస్తున్నారని ఆమ్‌ఆద్మీ పార్టీ ఆరోపించిన నేపథ్యంలో జైళ్ల శాఖ ఈ మేరకు స్పందించింది. ఖైదీలకు కల్పించే సౌకర్యాల్లో ఎలాంటి వివక్ష లేదని దిల్లీ జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సంజయ్ బనివాల్ తెలిపారు. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉంటాయని పేర్కొన్నారు.
మద్యం విధానానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో అరెస్టైనా సీఎం కేజ్రీవాల్ ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. తిహాడ్ జైలులో ఉంటూనే పాలనకు సంబందించిన ఆదేశాలను ఇస్తున్నారు.
జైలులోనే మంత్రులతో భేటీ- అభివృద్ధిపై సమీక్ష
జైల్లో ఉన్న కేజ్రీవాల్ వచ్చే వారం నుంచి ఇద్దరేసి మంత్రులతో కారాగారంలోనే సమావేశవుతారని ఆయనను కలిసిన ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ సోమవారం తెలిపారు. ఈ భేటీల సందర్భంగా అభివృద్ధి పనుల పురోగతిని సీఎం సమీక్షిస్తారన్నారు. మరోవైపు తీహాడ్ జైల్లో అరవింద్ కేజ్రీవాల్‌కు సరైన సౌకర్యరాలు కల్పించడం లేదని, నేరస్థుడి కంటే దారుణంగా చూస్తున్నారని ఆప్ ఆరోపించింది. కుటుంబ సభ్యులతో నేరుగా ములాఖత్ అయ్యే అవకాశం కల్పించడం లేదని పేర్కొంది.
ఆప్ నిధుల నిర్వాహకుడి అరెస్టు
గోవా శాసనసభ ఎన్నికల్లో ఆప్ నిధులను నిర్వహించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న చాన్‌ప్రీత్ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోమవారం అరెస్టు చేసింది. దిల్లీ మద్యం విధానం అంశంలో మనీ లాండరింగ్ చట్టం కింద అతన్ని కస్టడీలోకి తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఏప్రిల్ 18 వరకు ఈడీ కస్టడీకి పంపినట్లు పేర్కొన్నాయి. గతంలో ఇదే కేసుకు సంబంధించి చాన్‌ప్రీత్‌ను సీబీఐ అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకూ నమోదైన అరెస్టుల సంఖ్య 17కు చేరింది.