Kejriwal Election Promises For Priests : దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పూజారులు, గ్రంథీలపై వరాల జల్లు కురిపించారు. తమ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే 'పూజారీ గ్రంథీ సమ్మాన్ యోజన' కింద ప్రతి అర్చకుడికి, గురుద్వారాల్లోని గ్రంథీలకు నెలకు రూ.18,000 చొప్పున గౌరవ వేతనంగా అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ మంగళవారం నుంచి ప్రారంభం అవుతుందని, కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయంలో తానే ఈ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తానని అరవింద్్ కేజ్రీవాల్ తెలిపారు.
అడ్డుకుంటే మహాపాపం!
పనిలోపనిగా బీజేపీపై అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు.మహిళా సమ్మాన్ యోజనను బీజేపీ ఆపాలని చూస్తోందని విమర్శించారు. అదే విధంగా ఈ 'పూజారీ గ్రంథీ సమ్మాన్ యోజన' పథకాన్ని కూడా అడ్డుకోవాలని చూస్తే వారికి మహా పాపం తగులుతుందని వ్యాఖ్యానించారు.
ఇమామ్‌ల ఆందోళన
మరోవైపు, తమకు నెలవారీగా అందిస్తామన్న గౌరవ వేతనాన్ని వెంటనే విడుదల చేయాలంటూ మసీదుల ఇమామ్‌లు సోమవారం దిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నివాసం బయట ఆందోళనలకు దిగడం గమనార్హం.
ఆర్థిక సాయం చేయండి: సిసోదియా
దిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోదియా ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు ఆర్థిక సాయం చేయాలని నేరుగా ప్రజలను కోరారు. దిల్లీలోని జంగ్‌పుర అసెంబ్లీ స్థానం నుంచి పోటీకి దిగిన సిసోదియా ప్రజల మద్దతు కోరుతూ, ఆన్‌లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాంను ప్రారంభించారు. దీని ద్వారా తనకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
'ప్రస్తుతం నేను దిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాను. మీ మద్దతుతో ఇన్నాళ్లూ విజయం సాధిస్తూ వచ్చాను. ఈసారి కూడా మీ సహకారం నాకు కావాలి. దయుంచి నాకు ఆర్థిక సాయం చేయండి. మీరు అందించే విరాళం దిల్లీలో ఉద్యోగ, విద్యా పురోగతికి ఉపయోగపడుతుంది' అని మనీశ్ సిసోదియా పేర్కొన్నారు.