తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్రదాడిలో ముందు డ్రైవరే టార్గెట్- తప్పక ప్రతీకారం తీర్చుకుంటామన్న కేంద్రం! - Kathua Terror Attack

Jammu Kashmir Terror Attack : జమ్ముకశ్మీర్‌లోని కఠువా జిల్లాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం వల్ల భద్రతా బలగాలు పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యాయి. ముష్కరుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ఉగ్రదాడిపై ప్రతీకారం తీర్చుకోకుండా ఉండబోమని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు రెక్కీ నిర్వహించి, స్థానిక గైడ్ల సాయంతో అత్యాధునిక ఆయుధాలతో ఉగ్రవాదులు ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.

Kathua Terror Attack
Kathua Terror Attack (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 9, 2024, 1:26 PM IST

Jammu Kashmir Terror Attack :జమ్ముకశ్మీర్‌లోని కఠువా జిల్లాలో ఐదుగురు జవాన్ల ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు కొనసాగుతోంది. కఠువాలోని మాచేడీ ప్రాంతంలో ముష్కరుల కోసం అణువణువూ జల్లెడపడుతున్నారు. గాలింపు చర్యల్లో హెలికాప్టర్లను సైతం వినియోగిస్తున్నారు. ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోకుండా ఉండబోమని రక్షణ శాఖ కార్యదర్శి గిరిధర్‌ అరమనే స్పష్టం చేశారు. మృతి చెందిన సైనికుల కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. ఆ ఐదుగురు జవాన్లు ఉత్తరాఖండ్​కు చెందిన వారే.

రోడ్డు సరిగా లేని ప్రాంతంలో మాటు
ముందుగా రెక్కీ నిర్వహించి స్థానికుల సాయంతో అత్యాధునిక ఆయుధాలు ఉపయోగించి ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. కఠువా జిల్లాలో సోమవారం జరిగిన దాడికి గతంలో రియాసీలో బస్సుపై జరిగిన ఉగ్ర ఘటనకు పోలికలున్నాయి. మాచేడీ- కిండ్లీ- మల్హార్‌ రోడ్డులో బడ్‌నోటా అనే గ్రామం వద్ద రోడ్డు బాగోలేదు. ఏ వాహనమైనా ఇక్కడ గంటకు 15 కిలోమీటర్ల వేగాన్ని మించకుండా వెళ్లాల్సిందే. ఉగ్రవాదులు ముందుగా రెక్కీ నిర్వహించి దాడికి ఈ ప్రాంతం అనువుగా ఉంటుందని గుర్తించి మాటువేశారు. ఇద్దరు లేదా ముగ్గురు పాక్‌ ఉగ్రవాదులకు ఒకరు లేదా ఇద్దరు స్థానిక గైడ్లు సాయం చేసినట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాంతంపై పక్కాగా గురిపెట్టేలా సమీపంలోని ఓ కొండపై ముష్కరులు మాటు వేశారు.

తొలుత టార్గెట్‌ డ్రైవరే
వాహనం తమ టార్గెట్​లోకి రాగానే తొలుత గ్రనేడ్‌ విసిరారు. ఆ తర్వాత తక్షణమే డ్రైవర్‌ను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. అనంతరం నిలిచిపోయిన వాహనంపై విచక్షణారహితంగా రెండువైపుల నుంచి కాల్పులు జరిపారు. ఆ తర్వాత స్థానిక గైడ్‌ సాయంతో ఉగ్రవాదులు అటవీ ప్రాంతం గుండా తమ స్థావరాలకు పారిపోయినట్లు భావిస్తున్నారు. ముష్కరులు రెక్కీ నిర్వహించడానికి, వారికి ఆహారం సమకూర్చడానికి ఆ గైడ్లే సాయం చేశారు. గతంలోనూ ఉగ్రమూకలు ఇలా వాహన చోదకుడినే తొలుత టార్గెట్‌ చేసుకొన్నాయి.

పాకిస్తాన్‌తో సరిహద్దు కలిగిన కఠువా ప్రాంతంలోకి రెండు నెలల క్రితమే పెద్దసంఖ్యలో విదేశీ ఉగ్రవాదులు చొరబడినట్లు భద్రతా దళాలకు సమాచారం ఉంది. అమెరికా తయారీ ఎం4 కార్బైన్‌ను ఇటీవల కాలంలో ఉగ్రవాదులు ఎక్కువగా వినియోగిస్తున్నారు. నాటో దళాలు వాడే ఎం16ఏ2కు ఇది తేలికపాటి రకం. 2021లో అఫ్గానిస్థాన్‌ నుంచి అమెరికా దళాలు బిలియన్ల డాలర్లు విలువైన ఆయుధాలు వదిలి వెళ్లిపోయాయి. వీటిని పాక్‌లోని ఉగ్రసంస్థలైన లష్కరే, జైషేలు తాలిబన్ల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. అవి గత కొంతకాలంగా పాక్‌ మీదుగా కశ్మీర్‌లోకి మెల్లగా చేరుతున్నాయి. కఠువాలో సైనిక గస్తీ వాహనంపై ఉగ్రదాడికి తామే పాల్పడినట్లు ఉగ్ర సంస్థ కశ్మీర్‌ టైగర్స్‌ ప్రకటించింది. పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత జైషే మహమ్మద్‌ ఉగ్ర సంస్థకు దీన్ని షాడో సంస్థగా భావిస్తారు.

రష్యా సైనికులు వేసుకునే బూట్లు మనవే- ఎక్కడ తయారు చేస్తారో తెలుసా? - Russian Army Shoes

సైనిక వాహనంపై ఉగ్రదాడి వారి పనే- ఈమధ్యే సరిహద్దుల్లో నుంచి దేశంలోకి! - Kathua Terror Attack

ABOUT THE AUTHOR

...view details