Kannada Film Actor Darshan Got Bail : అభిమాని హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ సినీ నటుడు దర్శన్‌కు, అతడి స్నేహితురాలు పవిత్ర గౌడకు కర్ణాటక హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది.
సినీఫక్కీలో హత్య
ప్రముఖ కన్నడ సినీ నటుడు దర్శన్ తూగుదీపా అరెస్టుకు దారితీసిన హత్య కేసులో సినీఫక్కీలో అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం- '2024 జూన్ 9న చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తిని దర్శన్, అతడి స్నేహితురాలు హత్య చేశారు. తరువాత కొంత మంది అనుచరుల సాయంతో రేణుకా స్వామి మృతదేహాన్ని బెంగళూరు కామాక్షిపాల్యలోని ఓ మురికి కాల్వలో పడేశారు.' అయితే స్థానికుల ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్శన్ మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా అతనే ఈ హత్యకు పాల్పడినట్లు కేసు నమోదు చేశారు.
హత్యకు కారణమిదే!
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం- 'కన్నడ నటుడు దర్శన్ తన భార్యకు దూరంగా ఉంటూ, కన్నడ నటి పవిత్ర గౌడతో సహజీవనం చేస్తుండడం, ఆయన వీరాభిమాని అయిన రేణుకాస్వామికి ఏమాత్రం నచ్చలేదు. పవిత్ర తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో దర్శన్‌తో కలిసి ఉన్న ఫోటోలను పోస్టు చేయగా వాటికి రేణుకాస్వామి అసభ్యకరంగా కామెంట్లు పెట్టాడు. పవిత్ర వల్లే దర్శన్ తన భార్యకు దూరంగా ఉంటున్నారని, ఆయన్ను విడిచి వెళ్లిపోవాలంటూ తరచూ పోస్టులు పెట్టేవాడు. ఆమెపై బెదిరింపులకు కూడా దిగాడు. పవిత్ర గౌడ ఈ విషయాన్ని దర్శన్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన- తన అభిమాన సంఘం నాయకులు, ఇతరులతో కలిసి రేణుకాస్వామిని బలవంతంగా బెంగళూరు తీసుకొచ్చారు. తరువాత బాధితుడిని ఓ గోదాములో ఉంచి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి, ఇనుప రాడ్లతో కొట్టి, చిత్రహింసలు పెట్టారు. తనను చంపవద్దని రేణుకాస్వామి ఎంత ప్రాధేయపడినప్పటికీ వాళ్లు కనికరించలేదు. దీనితో దెబ్బలకు తట్టుకోలేక అతను చనిపోయాడు. దీనితో అతని శవాన్ని మురికి కాల్వలో పడేశారు.'
జైలులో రాచమర్యాదలు
అభిమాని హత్యకేసులో ఏ1 నిందితురాలుగా పవిత్ర గౌడ, ఏ2గా దర్శన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారికి జైల్లో రాచమర్యాదలు జరుగుతున్నాయని ఆరోపణలు వచ్చాయి. సోషల్ మీడియాలో దర్శన్ తన మిత్రులతో కలిసి సిగరెట్ తాగుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. దీనితో బెంగళూరు న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయనను బళ్లారి జైలుకు తరలించారు. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉన్నారు. తాజాగా వారికి కర్ణాటక హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది.