JP Morgan Vp On Caste Discrimination :గుజరాత్ గాంధీనగర్‌లో ఇల్లును కొనుగోలు చేసే క్రమంలో కులవివక్షతను ఎదుర్కొన్నానని జేపీ మోర్గాన్ వైస్ ప్రెసిడెంట్ అనిరుధ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఆయన తన ట్వీట్‌ను గుజరాత్ ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర పోలీసులు, గుజరాత్ బీజేపీకి ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన నెటిజన్లు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
'ముంబయిలో కొంత కాలం నివసించిన తర్వాత సింగపూర్‌లో ఉండే అవకాశాన్ని పక్కన పెట్టి గుజరాత్ వెళ్లాలని నిర్ణయించుకున్నాను. గిఫ్ట్‌సిటీ, ప్రధాని మోదీ దార్శనికత పట్ల నేను ఆకర్షితుడిని అయ్యాను. దీని నుంచి స్ఫూర్తిని పొంది గుజరాత్లో ఇంటిని కొనుగోలు చేయాలనే ఆలోచనకు ముందడుగు వేసేలా చేసింది. అయితే ఆ ఉత్సుకత గుండె చలించిపోయేలా చేసింది' అని జేపీ మోర్గాన్ వైస్ ప్రెసిడెంట్ అనిరుధ్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
'కుల వివక్షతను ఎదుర్కొన్నాను'
గుజరాత్‌లోని సంత్ విహార్ ఒకటో సొసైటీలో తాను కులవివక్షత ఎదుర్కొన్నట్లు ఆరోపించారు. తాను నగరంలో అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నప్పుడు సొసైటీ మేనేజ్మెంట్ కులం కారణంగా తిరస్కరించిందని ఆరోపించారు. ఆ సంస్థ ఛైర్మన్, మేనేజ్మెంట్ బహిరంగంగా ఇతర కులాలకు చెందిన వారు ఫ్లాట్లు కొనుగోలు చేయడానికి వీలు లేదని వారు నిర్ణయించారని ఆరోపించారు. తన హక్కులను తిరిగి పొందేందుకు న్యాయపరమైన చర్యలు తీసుకోవాలనుకుంటున్నట్లు జేపీ మోర్గాన్ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు. 'దాదాపు 30 మంది గుమిగూడడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. ఒకవేళ నేను ఫ్లాట్‌ను కొనుగోలు చేసేందుకు ముందుకు సాగితే తీవ్ర పరిమాణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారు' అని అనిరుధ్ తెలిపారు.