మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ జేఎంఎం నాయకుడు హేమంత్ సోరెన్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించడానికి సుప్రీం కోర్టు ప్రత్యేక త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసింది.
జేఎంఎం నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు రాలేకపోయారు. వారు బయలుదేరాల్సిన విమానం వాతావరణ పరిస్థితులు అనుకూలించక అక్కడే ఆగిపోయింది. దీంతో పాటు రాంచిలోని బిర్సా ముండా విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన అన్ని విమానాలు రద్దు అయ్యాయి.
ఝార్ఖండ్‌లోని సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలతో కూడిన రెండు విమానాలు హైదరాబాద్‌కు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. సర్క్యూట్ హౌజ్ నుంచి బయలుదేరిన బస్సులు ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాయి.
"కొత్త సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం. మాకు మద్దతుగా 47 మంది ఎమ్మెల్యేలు సభలో ఉన్నారు" అని జేఎంఎం అధికార ప్రతినిధి సుప్రియో భట్టాచార్య తెలిపారు.
గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాలని కోరారు ఝార్ఖండ్ ముక్తి మోర్చా శాసనసభా పక్ష నాయకుడు చంపయీ సోరెన్. 22మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను గవర్నర్‌కు అందజేసినట్లు చెప్పారు దీనికి గవర్నర్ సైతం అంగీకారం తెలిపినట్లు ఆయన వెల్లడించారు. న్యాయ సలహా తీసుకున్న అనంతరం ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తానని చెప్పినట్లు సోరెన్ వివరించారు. దీంతో పాటు తమకు మద్దతుగా ఉన్న 43 మంది ఎమ్మెల్యేలను చూపిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.
గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసేందుకు రాజ్‌భవన్ చేరుకున్నారు ఝార్ఖండ్ ముక్తి మోర్చా శాసనసభా పక్ష నాయకుడు చంపయీ సోరెన్. ఆయన వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి సుప్రొయో భట్టాచార్య ఉన్నారు.
ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను పీఎంఎల్‌ఏ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే ఈడీ 10రోజుల రిమాండ్ అడిగిందని, తదుపరి విచారణ శుక్రవారం జరగనుందని న్యాయవాది మనీశ్ సింగ్ తెలిపారు.
రాజభవన్ నుంచి జేఎంఎం శాసనసభా పక్ష నేత చంపయీ సోరెన్‌కు పిలుపు వచ్చింది. ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను చంపయీ కలిసేందుకు సాయంత్రం 5:30గంటలకు అపాయింట్మెంట్ లభించింది
Jharkhand Politics Today : ఝార్ఖండ్‌లో బీజేపీ ఆపరేషన్ కమలం ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు జేఎంఎం నేతృత్వంలోని అధికార కూటమి చర్యలు ప్రారంభించింది. తమ కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించనుంది. అందుకు రెండు ఛార్టెడ్ విమానాలను బుక్ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
81మంది సభ్యుల అసెంబ్లీలో తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, గవర్నర్ నుంచి ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానం కోసం ఎదురుచూస్తున్నట్లు జేఎంఎం శాసనసభాపక్ష నేతగా చంపయీ సోరెన్ తెలిపారు. రాజ్‌భవన్ నిద్ర నుంచి మేల్కోవాలని ఎద్దేవా చేశారు. మరోవైపు, అధికార కూటమి మధ్యాహ్నం 3 గంటలకు గవర్నర్ అపాయింట్మెంట్ కోరిందని కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్ రాజేశ్ ఠాకూర్ తెలిపారు. అపాయింట్మెంట్ విషయంలో గవర్నర్ ఆలస్యం చేస్తే ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు వెళ్తారని చెప్పారు.
హేమంత్‌ను కోర్టులో హాజరుపరిచిన ఈడీ
మరోవైపు, బుధవారం అరెస్టైన ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు రాంచీలోని పీఎంఎల్‌ఏ కోర్టులో హాజరుపరిచారు. భారీ బందోబస్తు మధ్య హేమంత్ సోరెన్‌ను పీఎంఎల్‌ఏ కోర్టుకు తీసుకొచ్చింది ఈడీ.
సుప్రీంకు హేమంత్!
అంతకుముందు హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తన అరెస్టును సవాలు చేస్తూ గురువారం ఆయన పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం కోర్టు విచారణ జరపనుంది. అరెస్టుకు ముందు రాష్ట్ర ప్రజలు, పార్టీ నేతలను ఉద్దేశించి సోరెన్ ఓ వీడియోను రికార్డు చేశారు. బుధవారం రికార్డు చేసిన ఆ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.
"ఈడీ నన్ను అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. దానికి నేనేమీ బాధపడటం లేదు. ఎందుకంటే నేను శిబుసోరెన్ కుమారుడిని. రోజంతా ప్రశ్నించిన తర్వాత నాకు సంబంధంలేని కేసులో అధికారులు అరెస్టు చేయాలని నిర్ణయానికి వచ్చారు. వారు ఎలాంటి ఆధారాలను గుర్తించలేదు. దిల్లీలోని నివాసంలో సోదాలు నిర్వహించి నా ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు యత్నించారు. పేదలు, ఆదివాసీలు, దళితులు, అమాయక ప్రజలపై అరాచకాలకు పాల్పడే వారిపై ఇప్పుడు సరికొత్త పోరాటం చేయాల్సి ఉంది" అని సోరెన్ ఆ వీడియోలో తెలిపారు.