Jharkhand Political Crisis : నగదు అక్రమ చలామణి కేసులో ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టయిన నేపథ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి వీడింది. 81 మంది ఎమ్మెల్యేలున్న శాసనసభలో తనకు 48 మంది మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని జేఎంఎం శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన చంపయీ సోరెన్ రెండోసారి చేసిన వినతిపై గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ గురువారం రాత్రి నిర్ణయం తీసుకున్నారు. సీఎంగా చంపయీ సోరెన్‌ను నియమించారు. పదవీ ప్రమాణం స్వీకరించడానికి ఆహ్వానించారు. 'చంపయీ సోరెన్‌ను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆహ్వానించాం. ఎప్పుడు ప్రమాణం చేస్తారో చంపయీ సోరెన్ నిర్ణయించుకోవాలి' అని గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ నితిన్ మదన్ కులకర్ణి అన్నారు.
10 రోజుల్లో బలపరీక్ష
మరోవైపు, తన ప్రభుత్వానికి మెజారిటీ ఉందని నిరూపించుకోవడానికి కొత్త సీఎంగా ఎన్నికైన చంపయీ సోరెన్‌కు గవర్నర్ 10 రోజుల సమయం ఇచ్చినట్లు ఆ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రాజేశ్ ఠాకుర్ తెలిపారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర రాష్ట్రంలోకి ప్రవేశించే ముందు అంటే శుక్రవారం మధ్యాహ్నానికి చంపయీ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని అన్నారు. ఇదే విషయాన్ని ఝార్ఖండ్ సీఎల్పీ నేత ఆలంగీర్ ఆలం సైతం తెలిపారు.
గవర్నర్ జాప్యంపై కాంగ్రెస్ ఫైర్
Congress Fires On Jharkhand Governor : ముఖ్యమంత్రిగా తనను నియమించాలంటూ చంపయీ సోరెన్ చేసిన అభ్యర్థనపై గవర్నర్ నిర్ణయం తీసుకోకపోవడం ఒక పట్టాన రాజకీయపక్షాలు తొలుత కలవరపడ్డాయి. ఈ నేపథ్యంలో మరోసారి గవర్నర్‌ను కలిసిన చంపయీ, ప్రలోభాలకు అవకాశం లేకుండా ఉండాలంటే కొత్త సర్కారు ఏర్పాటుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని గవర్నర్‌ను కోరారు. మెజార్టీ సభ్యుల మద్దతున్న నేతను సీఎంగా ప్రమాణం చేయడానికి పిలవకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని, ప్రజాతీర్పును కాలరాసినట్లేనని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.