తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బలపరీక్షలో నెగ్గిన చంపయీ సోరెన్ సర్కార్​

Jharkhand Assembly Floor Test : బల పరీక్షలో ఝార్ఖండ్​ సర్కార్ గట్టెక్కింది. అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో అధికార పార్టీకి 47మంది అనుకూలంగా ఓటువేయగా, విపక్షానికి 29 మంది ఓటేశారు. దీంతో విశ్వాస పరీక్షలో ప్రభుత్వం నెగ్గింది.

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2024, 2:13 PM IST

Updated : Feb 5, 2024, 3:17 PM IST

Jharkhand Assembly Floor Test
Jharkhand Assembly Floor Test

Jharkhand Assembly Floor Test :ఝార్ఖండ్ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో చంపయీ సోరెన్ సర్కార్ విజయం సాధించింది. ప్రభుత్వానికి మద్దతుగా 47మంది ఓటేయగా, వ్యతిరేకంగా 29 మంది ఓటేశారు. దీంతో విశ్వాస పరీక్షలో ఝార్ఖండ్ సర్కార్ నెగ్గింది. అంతకుముందు శాసనసభలో సీఎం చంపయీ సోరెన్ ప్రభుత్వంపై విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్ ఓటింగ్​ను చేపట్టారు. మొత్తం 81మంది శాసససభ్యుల్లో 77మంది శాసనసభకు హాజరయ్యారు. అందులో 47మంది ప్రభుత్వానికి మద్దతుగా, 29 మంది వ్యతిరేకంగా ఓటేశారు. ఒకరు(స్వతంత్ర ఎమ్మెల్యే) ఓటింగ్ సమయంలో గైర్హాజరయ్యారు. ఈ క్రమంలో విశ్వాస పరీక్షలో చంపయీ సోరెన్ సర్కార్ నెగ్గింది.

ఝార్ఖండ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ కుట్ర'
ఝార్ఖండ్ సీఎం చంపయీ సోరెన్​ విశ్వాస తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ ప్రారంభించారు. కేంద్రం ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందన్న ఆయన రాష్ట్రంలో గిరిజనులు సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా, వారి నాయకత్వాన్ని అణిచివేస్తున్నారని ధ్వజమెత్తారు. ఝార్ఖండ్‌లోని ఏ గ్రామానికి వెళ్లినా ప్రతి ఇంట్లో హేమంత్ సోరెన్‌ పథకాలు కనిపిస్తాయని వివరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఝార్ఖండ్​ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ ప్రయత్నించిందని ఆరోపించారు. హేమంత్ సోరెన్‌ను తప్పుడు కేసుల్లో ఇరికించేందుకు బీజేపీ కేంద్ర ఏజెన్సీలను ఉపయోగిస్తోందని మండిపడ్డారు.

'దేశ చరిత్రలో చీకటి రోజు'
2 రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా తొలిరోజే నిర్వహించిన విశ్వాస పరీక్షలో మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన మాజీ CM హేమంత్‌ సోరెన్‌ ఓటింగ్‌లో పాల్గొన్నారు. బలపరీక్షలో పాల్గొనేందుకు రాంచీలోని ప్రత్యేక కోర్టు హేమంత్‌కు అనుమతివ్వగా పటిష్ఠమైన భద్రత మధ్య ఆయనను పోలీసులు అసెంబ్లీకి తరలించారు. కేంద్రం తనపై కుట్ర చేసిందనీ, ఈ అక్రమ అరెస్టులో రాజ్‌భవన్‌ హస్తం ఉన్నట్లు అనుమానం ఉందని హేమంత్‌ ఆరోపించారు. అవినీతి జరిగిందన్న ఆరోపణలకు ఈడీ ఆధారాలు చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. తమను కొందరు అంటరానివారిలాగా చూస్తున్నారన్న ఆయన ఈ అరెస్టు భారత చరిత్రలో చీకటి అధ్యాయమన్నారు.

గవర్నర్ ప్రసంగం
అంతకుముందు విశ్వాస పరీక్ష కోసం చంపయీ సోరెన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఝార్ఖండ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆ రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రసంగించారు. ఝార్ఖండ్‌ను అవినీతి రహితంగా, సంపన్నంగా మార్చడమే తమ కర్తవ్యమని అన్నారు. 'గత కొన్నేళ్లుగా ఝార్ఖండ్​ ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కోసం పని చేసింది. ఇప్పుడు రాష్ట్రాన్ని మరింత పురోగతి వైపు సాగించడం మా పని.' అని గవర్నర్ అసెంబ్లీలో మాట్లాడారు.

తాను ప్రసంగిస్తున్న సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేయడంపై అసెంబ్లీ వెలుపల గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ స్పందించారు. 'గవర్నర్ ప్రసంగాన్ని అధికార పక్షం సిద్ధం చేసింది. అయినా నా ప్రసంగం సమయంలో వారే నినాదాలు చేస్తున్నారు. ఈ ప్రవర్తన వారు మరింత పరిణతి చెందాలని సూచిస్తోంది. నేను నా కర్తవ్యాన్ని నిష్పక్షపాతంగా పూర్తి చేశాను.' అని గవర్నర్ పేర్కొన్నారు.

అంతకు ముందు ప్రలోభాలకు గురికావద్దన్న ఉద్దేశంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు రిసార్టులో ఉంచిన JMM, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను ప్రత్యేక బస్సులో అసెంబ్లీకి తరలించారు. మనీలాండరింగ్‌ కేసులో JMM అధ్యక్షుడు, ఝార్ఖండ్‌ మాజీ CM హేమంత్ సోరెన్‌ను విచారించిన ఈడీ అధికారులు జనవరి 31న ఆయనను అరెస్టు చేశారు. ముందుగా హేమంత్‌ సతీమణి కల్పన సోరెన్‌ను సీఎంగా ఎన్నుకుంటారని వార్తలొచ్చినా చివరకు పార్టీ సీనియర్‌ నేత చంపయీ సోరెన్‌ను ఆ పదవి కట్టబెట్టారు. ఈ క్రమంలో బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ సూచించగా విశ్వాస పరీక్ష సోమవారం జరిగింది. ఈ బలపరీక్షలో చంపయీ సోరెన్ ప్రభుత్వం నెగ్గింది.

రాజకీయ కారణాలతో దేశ సంస్కృతినే అవమానించారు!: మోదీ

'నన్ను జైలుకు పంపినా అభివృద్ధి ఆగదు- బీజేపీకి ఆప్​ తలవంచదు'

Last Updated : Feb 5, 2024, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details