Jharkhand Assembly Elections 2024 : ఝార్ఖండ్ తొలివిడత శాసనసభ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా 43 నియోజకవర్గాల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. ఓటింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించింది. ఈవీఎంలు, వీవీప్యాట్లు తీసుకొని పోలింగ్ సిబ్బంది ఇప్పటికే తమకు కేటాయించిన కేంద్రాలకు తరలివెళ్లారు.
పోలింగ్ ఏర్పాట్లు!
ఝార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలు ఉండగా 43 నియోజకవర్గాల్లో బుధవారం తొలి విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 683మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 609మంది పురుషులు కాగా, 73 మంది మహిళలు, ఇతరులు ఒకరు ఉన్నారు.
43 నియోజకవర్గాల్లో జనరల్ అభ్యర్థులకు 17, ఎస్టీలకు 20, ఎస్సీలకు 6 స్థానాలు రిజర్వ్డ్గా ఉన్నాయి. ఈ విడతలో 1.37 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వారికోసం 15,344 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. అందులో 12,716 పోలింగ్ కేంద్రాలు గ్రామీణప్రాంతాల్లో, 2,628 కేంద్రాలు పట్టణ ప్రాంతాల్లో ఉన్నాయి.
పోలింగ్ స్టార్ట్
ఝార్ఖండ్ తొలివిడత పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. సమస్యాత్మకంగా గుర్తించిన 950 పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించనున్నారు. ఝార్ఖండ్‌లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక రూ.179.14 కోట్ల విలువైన అక్రమ సామగ్రి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి 54 కేసులు కూడా నమోదయ్యాయి.
పోటాపోటీ!
ఝార్ఖండ్‌లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఎన్డీఏ కూటమి నుంచి ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు ప్రచారం చేశారు. బంగ్లా అక్రమ చొరబాట్ల అంశాన్ని బీజేపీ ప్రచార అస్త్రంగా చేసుకుంది. హేమంత్ సోరెన్ సారథ్యంలోని జేఎంఎం ప్రభుత్వం అవినీతి, కుంభకోణాలకు పాల్పడిందని ఆరోపించింది. ఇండియా కూటమి తరఫున మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పన ప్రచారం నిర్వహించారు. గిరిజన హక్కులతో సహా, ప్రజాకర్షక పథకాలను వారు తమ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించారు. గత ఎన్నికల్లో 30 స్థానాల్లో గెలుపొందిన జేఎంఎం పార్టీ - కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతుతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పట్లో బీజేపీకి 25 సీట్లు వచ్చాయి.
వయనాడ్ ఉపఎన్నిక
కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానానికి కూడా నవంబర్ 13న ఉప ఎన్నిక జరగనుంది. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ఈ స్థానం నుంచి యూడీఎఫ్ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. ఈ ఉపఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీటితో పాటు దేశంలోని పలు అసెంబ్లీ స్థానాలకు కూడా బుధవారమే ఉప ఎన్నికను నిర్వహిస్తున్నారు.