Jayaprada Non Bailable Warrant : ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఈఎస్ఐకి సంబంధించిన కేసులో జైలు శిక్ష పడిన ఆమెకు, తాజాగా మరో కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో నియమావళిని ఉల్లంఘించినందుకు గానూ ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో భాగంగా ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలంటూ రాంపుర్ ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది ప్రజాప్రతినిధుల కోర్టు.
ఇదీ జరిగింది
2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున రాంపుర్ నుంచి ఎంపీగా పోటీ చేశారు జయప్రద. ఈ క్రమంలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదు కాగా, ప్రస్తుతం ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్నాయి. అయితే, విచారణలో భాగంగా అనేక సార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు. దీంతో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. అంతకుముందు కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి, ఆమెను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. కానీ ఇప్పటివరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.
Jaya Prada Cinema Career :కాగా జయప్రద ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమలో 300కు పైగా చిత్రాల్లో నటించారు. సీనియర్ నటుడు కమల్ హసన్‌తో కలిసి నటించిన 'సాగర సంగమం' సినిమా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.