Jammu Kashmir Terror Attacks: జమ్ముకశ్మీర్‌లో వరుస ఉగ్రఘటనలు కలకలం రేపుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో మూడుసార్లు జరిగాయి. మంగళవారం రాత్రి జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు హతంకాగా, ఓ జవాన్ అమరుడయ్యారు. ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు.
దొడా జిల్లాలోని భదర్వా- పఠాన్‌కోట్ రహదారిపై చటర్‌గాలా ఎగువ భాగంలో ఉన్న ఉమ్మడి చెక్‌పోస్ట్‌పై ముష్కరులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన ఐదుగురు సైనికులతో పాటు ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కథువా జిల్లా సైదా సుఖాల్ గ్రామంలో నక్కిన ఉగ్రవాది కోసం భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. తప్పించుకునే క్రమంలో ముష్కరుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ కబీర్‌దాస్ తీవ్రంగా గాయపడ్డారు. సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు, మంగళవారం సాయంత్రం కథువా జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో హీరానగర్ సెక్టార్‌లోని ఒక ఇంటిపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ ఇంటి యజమాని గాయాలపాలయ్యారు. దానిపై సమాచారం అందుకున్న పోలీసులు, పారామిలిటరీ బలగాలు కలిసి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ చర్యల్లో భాగంగా జరిపిన కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. మరొకరి కోసం డ్రోన్ల సాయంతో గాలింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 15గంటల ఆపరేషన్ తర్వాత భద్రతాదళాలు మరో ఉగ్రవాదిని కూడా మట్టుబెట్టినట్లు పేర్కొన్నారు. ఆపరేషన్‌లో భాగంగా ఇద్దరు సీనియర్ అధికారులు ఉన్న వాహనానికి బుల్లెట‌్లు తగిలినప్పటికీ వారు సురక్షితంగా బయటపడినట్లు భద్రతా దళాలు తెలిపాయి.